Collector Koya Sri Harsha | పెద్దపల్లి, డిసెంబర్ 5 : మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ప్రతీ నెలా పాఠశాలలను పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో పాఠశాల పర్యవేక్షణ, అభ్యాసన అభివృద్ధి అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 మంది మండల విద్యాధికారులు, 36 మంది కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, తమ పరిధిలోని పాఠశాలలలో ప్రతీ నెలా మానిటరింగ్ నిర్వహించి, బోధనా ప్రక్రియలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, సమీక్షా నివేదికను సిద్ధం చేసి, జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
విద్యార్థుల్లో అభ్యాసనాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ప్రతీ నెలా పాఠశాలలను పరిశీలించి, సమీక్ష చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.