‘పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం. మేం అందించే 5 లక్షలకు మరికొంత కలుపుకొంటే మీరు అనుకున్నట్టు ఇల్లు నిర్మించుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీతో 2లక్షల వరకు రుణం అందించేలా చూస్తాం. ఈ రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది’ అంటూ ఆర్భాటంగా ప్రకటించిన అధికార పార్టీ నేతలు, ఆచరణలో తుస్సుమనిపించారు.
ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణం అందిస్తామనగా.. అనేక మంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇండ్లు మంజూరుకావడంతో సంబురపడ్డారు. కానీ, నేటికీ రుణాలు అందక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేతిలోఉన్న కొద్దోగొప్పో డబ్బులతో నిర్మాణాలు మొదలుపెట్టినా, తీరా రుణం అందక.. సక్రమంగా చెల్లింపులు లేక ఆ నిర్మాణాలను వివిధ దశల్లోనే వదిలేయాల్సిన దుస్థితి వచ్చింది.
కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 26 : కరీంనగర్ జిల్లాలో 10,867 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 9,634 మంది ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సమ్మతి తెలిపారు. మిగతా 1,233 మంది తమ వద్ద వివిధ కారణాలతో ఇండ్లు రద్దు చేయాలంటూ లిఖితపూర్వకంగా తెలిపారు. అందులో చాలావరకు డబ్బులు లేకపోవడంతోనే రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు 5,856 ఇండ్లకు మార్కవుట్ చేయగా, 4,321 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
2,529 బేస్మెంట్ స్థాయిలో ఉండగా, 1,158 రూఫ్ లెవల్, 632 స్లాబ్ పూర్తయ్యాయి. కేవలం రెండు ఇండ్లు మాత్రమే గృహప్రవేశాలు అయ్యాయి. లబ్ధిదారుల్లో అత్యధికులు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులే కాగా, చాలా మంది బ్యాంకు లింకేజీ ద్వారా తమకు రుణాలందిస్తారనే ధీమాతోనే పనులు మొదలు పెట్టారు. 70 శాతానికి పైగా లబ్ధిదారులు పేదరికంలో మగ్గుతున్న వారే కాగా, లక్ష నుంచి 2లక్షల దాకా అయినా రుణం రూపేనా అందుతుందని లబ్ధిదారులు ఆశించారు.
అయితే, రుణాల మంజూరు కాక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా రుణాల మంజూరుపై బ్యాంకర్లను ఆదేశిస్తే ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టిన కాలానికి ఎప్పుడో పూర్తయ్యేవని చెబుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది మాత్రం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారిలో పేదలను గుర్తిస్తూ రుణాలందేలా సహకరిస్తామని కొన్ని గ్రామాల్లో చెబుతున్నారు. కాగా, ఇండ్లు నిర్మించుకుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ వివరాలపై డీఆర్డీఏ అధికారులను ఆరా తీయగా, జిల్లా వ్యాప్తంగా నివేదికలు సేకరించలేదని పేర్కొనడం కొసమెరుపు.