Best Service Award | కోల్ సిటీ, ఆగస్టు 15: లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలిగా తానిపర్తి విజయలక్ష్మి అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమెకు ఉత్తమ సేవా పురస్కారం వరించింది.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 365 రోజులపాటు నిరుపేదల ఆకలి తీర్చేందుకు నిర్విఘ్నంగా చేపట్టిన నిత్య అన్నదానం సేవలను గుర్తించిన ప్రభుత్వం శుక్రవారం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్, పెద్దపల్లి, రామగుండం నియోజక వర్గాల శాసనసభ్యులు విజయ రమణ రావు, ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చేతుల మీదుగా ప్రధానం చేశారు. రామగుండం లయన్స్ క్లబ్ కు ప్రభుత్వ గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేసి ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం పట్ల గర్వంగా ఉందని లయన్స్ క్లబ్ సీనియర్ ప్రతినిధులు, పి ఎస్ టి లు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.