Student Leader | హుజురాబాద్ రూరల్, అక్టోబర్ 28 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చందమల చైతన్య ఆరోపించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది బాధ్యత వహించాలని, ప్రిన్సిపల్‌తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థి సంఘాల పక్షాన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా కనీసం విద్యాశాఖ పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించి గురుకులాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు అరుణ్ కుమార్, కొండపాక రాకేష్, బండ అశోక్, సురేష్, విక్రమ్, వినయ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.