Kanukula | సుల్తానాబాద్ రూరల్, మే 9 : అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కర్రే కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని సర్వేనెంబర్ 221 లో శనివారం గ్రామస్తులు, రైతులతో కలిసి సర్పంచ్ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనుకుల గ్రామంలోని సర్వే నెంబర్ 221లో నకల్ చత్వార్ ప్రకారం ఉన్న గైరాన్ ప్రభుత్వ భూమి 101 ఎకరాల 35 గుంటల భూమి ఉందన్నారు. అందులో నుంచి 11 ఎకరాల 23 గుంటల భూమిని ఒకరు అక్రమంగా భూభారతిలో 221/4 లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడీ చేయించుకున్నారని ఆరోపించారు.
అధికారులు వెంటనే ఆ పట్టా రద్దు చేసి చత్వార్ ప్రకారం ప్రకారం గైరాన్ భూమిగా మార్పిడీ చేసి గ్రామ ప్రజల అవసరాల రిత్యా వ్యవసాయ మార్కెట్, వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు, పశువుల సౌకర్యార్థం వినియోగించుకునేలా చూడాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లడానికి గ్రామస్తులం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కర్రె కవిత-కుమార్, సుబ్బని అనసూర్య-రాయమల్లు, ఉపసర్పంచ్లు వివేక్, వంశీ, గ్రామస్తులు నారాయణ, శంకరయ్య, శ్రీనివాస్, అశోక్ , రాజేశం, రాజయ్య, రామ్ రెడ్డి, దేవదాస్, కుమార్ రెడ్డి, మల్లయ్య లతోపాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై తహసీల్దార్ బషీరుద్దీన్ వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని పరిశీలన చేస్తున్నామని చెప్పారు.