డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం తమ వల్ల కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఏఈవోలు ఒకవైపు నెత్తీ నోరు మొత్తుకున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. సర్వే చేయడానికి ఏఈవోలు ఎందుకు నిరాకరిస్తున్నారో.. అందులోని సమస్యలేమిటో తెలుసుకోకుండా కచ్చితంగా చేసి తీరాల్సిందేనంటూ ఉక్కుపాదం మోపుతున్నది. అక్కడితో ఆగకుండా ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులపై ఒత్తిడి పెంచుతూనే వ్యవసాయ విస్తరణాధికారులపై క్రమశిక్షణ చర్యలకు దిగుతున్నది.
అందులో భాగంగానే వరంగల్ జిల్లాలో 59 మందికి అక్కడి జిల్లా వ్యవసాయధికారి షాకాజ్ నోటీసు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో గత నెల 27, 28 తేదీల్లో 40 మంది విధులకు గైర్హాజర్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపించారు. ఇలా మెజార్టీ జిల్లాలో జిల్లాల్లో చర్యలు తీసుకుంటుండగా, ఏఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఒంటెత్తు పోకడపై సమ్మె బాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కరీంనగర్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమని రాష్ట్రంలో ఉన్న 2,604 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇప్పటికే 49 రకాల విధులు నిర్వర్తిస్తున్న తమకు ఈ సర్వే తలకుమించిన భారం అవుతున్నదని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించారు. రైతు భరోసా, రైతు బీమా, పీఎం కిసాన్, పంట నష్టం సర్వే, పంట కోత ప్రయోగాలు, ధాన్యం సేకరణ, గ్రామాల వారీగా ప్రణాళిక, రుణమాఫీ కుటుంబ సర్వేల వంటి తదితర 49 రకాల విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
అలాగే ఒక్కో ఏఈవో పరిధిలో 4వేల నుంచి 8వేల మంది రైతులు, 6,500 నుంచి 8,500 ఎకరాలకు సంబంధించిన పనులను ఎటువంటి సహాయకులు లేకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తుండడం వల్ల భారం పడుతున్నదని ఆవేదన చెందుతున్నారు. ఈ విధుల నిర్వహణకు తాము సహాయకులను అడుగుతుంటే.. డిజిటల్ క్రాప్ సర్వే పేరిట ప్రభుత్వం మరింత భారం మోపాలని చూడడం భావ్యం కాదన్న వాపోతున్నారు. అలాగే ఏఈవోల్లో 65 శాతం మంది మహిళలే ఉన్నారని, ఈ పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. ప్రభుత్వం క్రాప్ సర్వేకు ఒత్తిడి తేవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సహాయకులు లేకుంటే ఎలా సాధ్యం
ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 20వేల ఫామ్స్ ఉంటాయి. పెద్ద క్లస్టర్లో అయితే 30వేలకు పైగా ఫామ్స్ ఉన్నాయి. క్రాప్ సర్వే కింద 15వేల ఫామ్స్ ఉన్న క్లస్టర్లో ఒక్కోఫామ్స్కు రెండు సార్లు వెళ్లినా ఒక క్రాప్ కాలంలో ఒక ఏఈవో 30వేల సార్లు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలా తిరగడం సాధ్యమయ్యే పనియేనా? అని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు.
క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం 25 మీటర్లకు ఒక ఫొటో తీయాల్సి ఉంటుందని, ఒకవేళ 25 మీటర్లలోపు కూడా వేర్వేరు పంటలుంటే ఆ ఫోటోలు వేర్వేరుగా తీయాల్సి ఉంటుందని, ఆ లెక్కన చూస్తే ఎకరానికి సగటున 20 ఫొటోలు తీసినా 8,500 ఎకరాలున్న క్లస్టర్ పరిధిలో 1,70,000 ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఇటువంటి సమయంలో సహాయకులు లేకుండా ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
గ్రామ భౌగోళిక విస్తీర్ణాన్ని సర్వే చేసేప్పుడు బీడు భూములు, సర్వేనంబర్లు, ఫారెస్టు ల్యాండ్ వంటివి ఉంటాయి. నిజానికి వ్యవసాయ శాఖ ఏఈవోల్లో 65 శాతం మంది మహిళలున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో మహిళలు సర్వే చేయడం సాధ్యం కాదని, తద్వారా వారి భద్రతకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాప్ సర్వేలో ఇటువంటి అనేక కష్టాలు, లోటుపాట్లు ఉన్నాయని, అందుకే ఈ సర్వేకు పక్కరాష్ర్టాలు అనుసరించిన విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలంటూ పలుసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశామని ఏఈవోలు చెబుతున్నారు.
మొదలైన చర్యలు
క్రాప్ సర్వేచేయడం సాధ్యం కాదని, పక్కరాష్ర్టాలు అనుసరించిన విధానాన్ని అమలు చేస్తే తాము సహకరిస్తామని ఒకవైపు ఏఈవోలు ముక్తకంఠంతో చెబుతున్నా.. సర్కారు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టడమే కాదు, బెదిరింపులకు పాల్పడుతున్నది. క్రాప్ సర్వేకు సంబంధించి యాప్ను వెంటనే ఏఈవోలు తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని, సర్వేను ప్రారంభించకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించడమే కాదు, ఏకంగా ఆచరణలో పెడుతున్నది.
అందులో భాగంగానే సదరు యాప్ డౌన్లోడ్ చేసుకోక పోవడంతోపాటు సర్వేలు చేయకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి ఇటీవల 59 మంది ఏఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, నోటీస్ అందుకున్న తదుపరి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో 40 మంది ఏఈవోలు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని, క్రాప్ సర్వే విధులను నిర్వహించడం లేదని గత నెల 27, 28 తేదీల్లో గైర్హాజర్ (ఆబ్సెంట్) వేస్తూ ప్రభుత్వానికి పంపించారు. ఇదే తరహాలో మరికొన్ని జిల్లాల్లోనూ జిల్లా వ్యవసాధికారులు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని ఆయా జిల్లాల వ్యవసాధికారుల వద్దకు వెళ్లి ఏఈవోల సంఘాలు ప్రశ్నిస్తే..
తమను ఈ విషయంలో ఏమీ అడగొద్దని, పై నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటున్నామని చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తమ ఉద్యోగాలకే ఎసరు వచ్చే పరిస్థితులున్నాయని అంటున్నట్టు తెలుస్తున్నది. అలాగే ఒకటి రెండు రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏఈవోల సంఘం షోకాజ్ నోటీసులు, ఆబ్సెంట్ల విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నది. దీనిపై ఏదో ఒక స్పష్టత రావాలంటే ఆందోళన బాట పట్టాలన్న నిర్ణయానికి రాగా, రాష్ట్ర టీఎన్జీవో సంఘం కూడా మద్దతిస్తున్నది.
అయితే ఒకటి రెండు రోజుల్లో మరోసారి ప్రభుత్వంతో మాట్లాడుదామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే.. ఏఈవోల సంఘం చేసే ఆందోళన కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్డౌన్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీఎన్జీవో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్పినట్టు తెలుస్తున్నది. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వం మొండిగా వెళ్తన్నందునే ఆందోళనబాట పట్టేందుకు ఏఈవోల రాష్ట్ర సంఘం కార్యాచరణ సిద్ధం చేసినట్టు కొంతమంది నాయకులు తెలిపారు.