రాష్ట్రంలో వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయలు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి పూర్తి స్థాయిలో మందులు, సదుపాయాలు, యంత్ర పరికరాలు ఏర్పాటు చేస్తున్నది. అలాగే, పట్టణాల్లో బస్తీ దవాఖానలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు, పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వసతులను, వైద్యులను నియమించి మెరుగైన వైద్యసేవలందిస్తున్నది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో పల్లె దవాఖానకు రూ.20 లక్షలు కేటాయించి భవన నిర్మాణం చేపట్టారు. ఎంబీబీఎస్, బీఎంఎస్ అర్హత ఉన్న వారిని వైద్యులుగా నియమించారు.
ఉదయం నుంచే ఓపీ సేవలు
పల్లె దవాఖానల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వరకు ఓపీ సేవలందిస్తున్నారు. ప్రాథమిక చికిత్స, మాతా శిశు సంరక్షణ సేవలు, టీకాలు వేయడంతోపాటు రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారిని పరీక్షించి మందులు అందిస్తున్నారు. ఇకడ సేకరించిన రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి పంపుతారు. మరుసటి రోజు ఆ నమూనాల ఫలితాలు తిరిగి పల్లె దవాఖానలకు వస్తాయి.
నియోజకవర్గంలో 39 పల్లె దవాఖానలు
చొప్పదండి మండలంలో తొమ్మిది పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారు. ఇందులో పట్టణంలో రెండు, మండలంలోని గుమ్లాపూర్, వెదురుగట్ట, రాగంపేట, చిట్యాలపల్లి, రుక్మాపూర్, ఆర్నకొండ, కాట్నపెల్లి, గంగాధర మండలం గట్టుభూత్కూర్, గర్షకుర్తి, ఉప్పరమల్యాల, కురిక్యాల, నారాయణపూర్, బూరుగుపల్లి, ర్యాలపల్లిలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. రామడుగు మండలం వెలిచాల, వెదిర, దేశరాజుపల్లి, రామడుగు, తిర్మలాపూర్, రుద్రారం, కొడిమ్యాల మండలం కొడిమ్యాల, కొండాపూర్, తిర్మలాపూర్, రాంసాగర్, నమిలికొండ, పూడూరు, తిప్పయ్యపల్లి, చెప్యాల, నాచుపల్లిలో దవాఖానలు ఏర్పాటు చేశారు. మల్యాల మండలం రాంపూర్, రామునిపేట, పోతారం, ముత్యంపేట, తాటిపెల్లి, తక్కళ్లపల్లి, కొత్తపేటలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. కాగా, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలు అందుతున్నయి
సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం పల్లె దవాఖానలను ఏర్పాటు చేయడం అభినందనీయం. దవాఖానలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. దీంతో ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే తిప్పలు తప్పినయ్.
-గుడిపాక సురేశ్, సర్పంచ్ (చిట్యాలపల్లి)
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
మాకు ఏదైన జబ్బు వచ్చినప్పుడు మండలంలోని ఆరోగ్య కేంద్రానికి పోయి పరీక్షలు చేయించుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు తెలంగాణ సర్కారు గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేయడంతో తిప్పలు తప్పినయ్. పల్లె దవాఖానలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– ఉస్కెమల్ల రత్నవ్వ (చిట్యాలపల్లి)