మల్లాపూర్, నవంబర్ 20: మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ధ్వజమెత్తారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మల్లాపూర్ మండల వ్యాప్తంగా ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు పథకాల్లో విఫలమైందని మండిపడ్డారు. మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యను వివరించారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు దేవ మల్లయ్య, ముద్దం శరత్, అల్లూరి ఆదిరెడ్డి, డబ్బ రమేశ్, కొంపల్లి రాజు, పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఏనుగు రాంరెడ్డి పాల్గొన్నారు.