Gopal Rao Peta | ధర్మారం, అక్టోబర్ 19 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావుపేట గ్రామస్తులు శ్రమదానం చేసి గ్రామానికి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులను తొలగించారు. నంది మేడారం ఆర్ అండ్ బి అర్హతరి నుంచి గోపాల్ రావు పేట గ్రామం వెళ్లే రోడ్డు కు ఇరువైపులా చెట్లు, చేమలు పెరిగి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెట్ల కొమ్మలు బాగా పెరిగి రోడ్డు వైపునకు విస్తరించాయి. దీంతో రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనం కనబడని స్థితి ఏర్పడింది. వీధి స్తంభాలు ఉన్నప్పటికీ చెట్ల కొమ్మల వలన అవి కనబడకుండా అయింది.
ఈ రోడ్డులో వాహనాలు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గ్రామస్తులు, యువకులు కలిసి శ్రమదానం చేసి ఇబ్బందులు తొలగించాలని సంకల్పించారు. దీంతో ఆదివారం వారంతా కలిసి తలా ఓ చేయి వేసి శ్రమదానం చేశారు. నంది మేడారం బైపాస్ నుంచి మల్లికార్జున గుడి సమీపం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను నరికి శుభ్రం చేశారు. గ్రామస్తులు, యువకులు శ్రమదానం చేయడంతో రోడ్డు ఎంతో శుభ్రపడి రాకపోకలకు ఎంతో సులువుగా మారింది.
శ్రమదానం చేసి రోడ్డు బాగు చేసిన వారందరినీ స్థానికులు అభినందించారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ సంకసాని సతీష్ రెడ్డి, దార వేణి అజయ్, సూరమల్ల ప్రశాంత్, కొత్తపల్లి రాకేష్, రేండ్ల నవీన్, బద్దం రాజేశ్వర్ రెడ్డి, పొన్నవేని మహేష్, ఆకుల రాకేష్, ఆకుల మధు, పొన్నవేని స్వామి, సంధినేని అనిల్, సంధినేని శ్రీకాంత్, సంకసాని శేఖర్ రెడ్డి, మెండే మధు పాల్గొన్నారు.