Sand Tractors | వీణవంక, ఆగస్టు 20 :తమ స్వంత ఖర్చులతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు వేసుకున్న మట్టి రోడ్డును ఇసుక ట్రాక్టర్లు నడుతుపూ ధ్వంసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గొల్లపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ పరిధిలోని గొల్లపల్లి గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములకు వేసుకున్న రోడ్డును ఇసుక ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారంటూ రైతులు పంట పొలాల వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులు గ్రామ శివారు నుండి మానేరువాగు వరకు సుమారు 20 ఏళ్ళ క్రితం తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళడానికి స్వంత ఖర్చులతో మట్టి రోడ్డు వేసుకొసి, వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు.
ఇటీవల ఇసుక ట్రాక్టర్లు వెళ్ళే రోడ్డు బాగాలేదని రైతులు వేసుకున్న మట్టి రోడ్డుపై నుండి వెళ్ళగా వర్షానికి పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి రోడ్డుపై నుండి వెళ్లొద్దని ఇసుక ట్రాక్టర్ల యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, దీంతో మట్టి రోడ్డు అధ్వాన్నంగా మారిందని వాపోయారు. గతంలో ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకోవడానికి వెళ్ళిన కానిస్టేబుల్‌కు సైతం తీవ్రగాయాలు కాగా, ట్రాక్టర్ ఓ ఇంటి గోడకు గుద్దుకోగా గోడకూలీ తృటిలో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సదరు ట్రాక్టర్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని గుర్తు చేశారు. రోడ్డు ధ్వంసం కావడంతో పాటు ప్రమాదాలు జరిగి ప్రజలు, రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు, పోలీసులు స్పందించి రైతులు వేసుకున్న రోడ్డుపై నుండి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తహసీల్దార్ రమేష్‌ను వివరణ కోరగా గతంలో కాలినడక రోడ్డు మాత్రమే ఉండేదని, రైతులు వేసుకున్న రోడ్డు కావున అందరి ఆమోదం మేరకు ట్రాక్టర్లు నడుపుకోవాలని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎద్దు రాయమల్లు, నేదురి రాజయ్య, బండి రాజయ్య, బండి ఓదెలు, వేల్పుల సంతోష్, బండి శంకర్, ఎద్దు లక్ష్మయ్య, బండ రాజకొమురయ్య, బండి చిన్న రవి తదితరులు పాల్గొన్నారు.