విదేశీ బంగారం వ్యవహారం సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతున్నది. గల్ఫ్ నుంచి తీసుకొచ్చిన దాదాపు రెండు కోట్ల విలువైన రెండు కిలోల బంగారంతో ఓ వ్యక్తి ఉడాయించాడనే ప్రచారం జోరుగా సాగుతున్నది. దీనిపై వేములవాడలో కేసు నమోదైనట్టు తెలియడం చర్చనీయాంశమవుతున్నది. అయితే స్వదేశానికి వచ్చే గల్ఫ్ కార్మికులే టార్గెట్‌గా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం తీసుకువచ్చే విషయంలో అత్యాశకు పోయి అమాయకులు బలవుతున్నట్టు తెలుస్తుండగా, దేశాలు దాటి కిలోల కొద్దీ బంగారం ఎలా బయటకు వస్తున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వేములవాడ, ఏప్రిల్ 4: సౌదీలో ఉంటున్న చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత నెల ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సయంలో ఆ ఇద్దరికి జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని మల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండు కిలోల బంగారాన్ని ఇవ్వాలని అకడి స్మగ్లర్లు చెప్పారు. అయితే అంత పెద్దమొత్తం బంగారం తాము తీసుకెళ్లమని జోగాపూర్వాసులు ముందుగా చెప్పినట్టు తెలిసింది. స్వదేశం చేరేవరకు మీ వెంట మా వ్యక్తి వస్తాడని, విమానాశ్రయంలో అంతా అతనే చూసుకుంటాడని స్మగ్లర్లు ఒప్పించినట్టు తెలిసింది.
హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే బంగారం సదరు వ్యక్తులకు అప్పగిస్తే లక్షన్నర నగదు, 10 గ్రాముల బంగారంతోపాటు ఫ్లైట్ టికెట్ చార్జీలు కూడా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అయితే, మూడు గంటల ప్రయాణంలో దాదాపు 2.50 లక్షలు వస్తుండడంతో ఆ ఇద్దరు గల్ఫ్ కార్మికులు ఆసక్తి చూపినట్టు తెలిసింది. అయితే, వెంటనే బంగారం తీసువస్తున్న విషయాలన్నింటినీ అందులోని ఒకరు తమ సమీప బంధువుకు సమాచారాన్ని ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సదరు సమీప బంధువు బంగారం ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదని, తాను అమ్మి పెడతానని రప్పించి, వారిని హైదరాబాద్‌లోని ఒక హోటల్లో దింపినట్టు సమాచారం.
అయితే, బంగారం బయట అమ్మేందుకు వెళ్లిన ఆ వ్యక్తి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో సదరు బంగారం ఇండియాకు పంపిన స్మగ్లర్ల ముఠా రంగంలోకి దిగి, చందుర్తి మండలంలోని జోగాపూర్‌కు చేరుకొని ఆరా తీసింది. చివరకు మల్లాపూర్‌కు చెందిన వ్యక్తితో వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయించగా, దాదాపు రెండు కోట్ల విలువైన బంగారంతో ఉడాయించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.
విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చిన వ్యవహారంలో సిరిసిల్ల జిల్లాలో రెండు పోలీస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన ఒకరు గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చారు. తంగళ్లప్లలి మండలంలోని ఒకరు ఆయన ద్వారా బంగారాన్ని పంపినట్టు తెలిసింది. అయితే మరుసటి రోజు బంధువులు గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికెళ్లి బంగారం గురించి అడగగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన వద్ద బంగారం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది.
దీంతో సదరు బాధితుడి బంధువులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. తాజాగా జోగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సౌదీ నుంచి వచ్చిన వ్యవహారంలోనూ ఇదే బంగారం వ్యవహారంలో కేసు నమోదైంది. అయితే విదేశీ బంగారం విషయంలో అమాయాకులు అత్యాశకు పోయి బలవుతున్నట్టు తెలుస్తున్నది. అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కిలోల కొద్ది బంగారం స్మగ్లింగ్ రూపంలో వస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
అయితే అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు క్షుణ్ణంగా జరుగుతున్నా.. కిలోల కొద్దీ బంగారం ఎలా బయటకు వస్తున్నది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం ఎలా వచ్చిందనేది అంతుచిక్కడం లేదు. ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు కలుగుతుండగా, పోలీసులు లోతుగా విచారిస్తే బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు, వారి వెనుక ఉన్న కథానాయకులు ఎవరనేది తేలుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.