Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 అనుబంధ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు జలాశయానికి గోదావరి జలాల ఎత్తిపోతలు వారం రోజుల నుంచి కొనసాగుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి నీరు వచ్చి చేరడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆదేశానుసారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ నెల 15 నుంచి జలాల ఎత్తిపోతల ప్రక్రియను చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరదాక ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రోజు రెండు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు .దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ప్రవహించి జంట సొరంగాల ద్వారా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ లోని సర్జి ఫూల్ కు చేరుకుంటుంది.
ఈ క్రమంలో తాజాగా సోమవారం నంది పంప్ హౌస్ లో 1,3 నంబర్ల మోటార్లను ఆన్ చేసి నంది రిజర్వాయర్ లోకి జలాలను లిఫ్ట్ చేశారు. అనంతరం ఎత్తిపోసిన జలాలు 6,300 క్యూసెక్కుల చొప్పున నీరు నంది రిజర్వాయర్ క్రష్ గేట్ల ద్వారా రెండు జంట సొరంగాల నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ పంప్ హౌస్ కు చేరుకుంటోంది. ఆ తర్వాత ఆ పంపు హౌస్ లో 2 బాహుబలి మోటార్లను ఆన్ చేయడంతో జలాలు వరద కాలువ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయానికి చేరుకుంటున్నాయి.