Appannapet | పెద్దపల్లి రూరల్, జనవరి 24 : పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులోని వినాయకనగర్ సమీపంలో తాడిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి బూరుగు సదయ్యగౌడ్ (44) అనే గీత కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బూరుగు సదయ్యగౌడ్ రోజు వారి మాదిరిగానే శనివారం ఉదయమే కల్లు గీత కోసం గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ సమీపంలో పొలంలో ఉన్న తాడి చెట్టు ఎక్కిన సదయ్య చెట్టు ఎక్కుతున్న కొద్ది సేపట్లోనే కనిపించకుండా పోవడంతో సహచర కార్మికులు పిలుచుకుంటూ వెళ్లే సరికి చెట్టు కింద పొలంలోనే పడిపోయి ఉన్నాడు.
ఈ ఘటనను గమనించిన కార్మికులు బురదలో కూరుకుపోయిన సదయ్యగౌడ్ ను గట్టుకు చేర్చి పరిశిలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమందించారు. మృతుడు సదయ్య గౌడ్ కు భార్య కవితతో పాటు ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.