Kodimyala | కొడిమ్యాల, ఫిబ్రవరి 12 : రెండు నెలల క్రితం కొడిమ్యాల గ్రామపంచాయతీ డ్రైనేజీ లోని చెత్త తీసి రోడ్డుపై వేశారు. కాలనీవాసులు చెత్తను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు చెత్తను ట్రాక్టర్ లో పోసి గ్రామపంచాయతీకి తరలించారు. కాగా గ్రామ పంచాయతీ సభ్యులు స్పందించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని నాచుపల్లి వెళ్లే దారిలో చిలుక వాగు నుండి రెండు నెలల క్రితం గ్రామపంచాయతీ పాలకవర్గసభ్యులు పారిశుద్ద్య పనులలో భాగంగా డ్రైనేజీలోని చెత్తను తీసి రోడ్డుపై వేశారు. గ్రామపంచాయతీ వారు చెత్తను తీయడంలో నిర్లక్ష్యం వహించారు.
ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం ట్రాక్టర్లో చెత్తను నింపి గ్రామపంచాయతీకి తరలించారు. గ్రామ ఉపసర్పంచ్ గుర్రం నరసయ్య గౌడ్ సమాచారం తెలుసుకొని గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తానని చెత్తను తొలగిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే జేసీబీ రెండు ట్రాక్టర్ల సహాయంతో చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు నెలలుగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈవో పాలకవర్గ సభ్యులు స్పందించలేదని గ్రామ పంచాయితీ వద్దకు తీసుకువెళ్తే స్పందించారని కాలనీవాసులు గ్రామస్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అఖిల్, రమేష్, కాలనీవాసులు సురుగు శ్రీనివాస్, అక్కనపల్లి నరేష్, నేరెళ్ల మోహన్(టీంకు), మహేష్ తదితరులున్నారు.