Garbage dumping | కార్పొరేషన్, జూన్ 15 : కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురుగా సేకరించి వర్మి కంపోస్ట్, డీఆర్సీసీ కేంద్రాలను తరలించి పద్దతిగా మిగిలిన చెత్తను ప్రాసెసింగ్ చేసేందుకు బల్దియా కృషి చేయాలి. కానీ నగరపాలక సంస్థలోని పలు డివిజన్లల్లో ఈ పద్ధతిని అధికారులు ఎప్పుడో మరిచిపోయారు. సేకరించిన చెత్తను డీఆర్సీసీ కేంద్రాలకు పంపించి డంప్‌యార్డుకు వచ్చే చెత్తను తగ్గించాలని ఉన్నతాధికారులు చెప్పుతుంటే కింది స్థాయి అధికారులు, సిబ్బంది మాత్రం దానిని మరోలా ఆచరణలో పెడుతున్నారు. ఇంటింటి నుంచి సేకరిస్తున్న చెత్తను డంప్‌యార్డుకు పంపకుండా నగరంలో ఎక్కువగా వినియోగంలో లేని రోడ్లను ఎంచుకొని ఆ రోడ్లకు ఇరువైపుల చెత్తను పారబోసి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు చనిపోయినా తర్వాత ప్రశాంతం అంత్యక్రియాలు చేయాల్సినా ప్రాంతాల్లోనూ చెత్త వేసి అంత్యక్రియలకు వచ్చే వారిని కూడా దుర్వాసనల్లోనే ఉండే విధంగా పరిస్థితులు నెలకున్నాయి.
స్మశాన వాటికే చెత్త డంప్‌యార్డు..
నగరాలు, పట్టణాల్లో గ్రామాలు విలీనం అయితే ఆయా ప్రాంతాల్లో పట్టణీకరణ మార్పులు వస్తాయని అందరు ఆశిస్తారు. కానీ నగరపాలక సంస్థలో దీనికి విరుద్దంగా ఉంది. ఇటీవల నగరంలో విలీనం అయినా చింతకుంటలో సేకరించిన చెత్తంతటిని పారిశుద్ద్య సిబ్బంది ఆ ప్రాంతానికి చెందిన స్మశాన వాటికల్లోనే వేస్తుండడం గమనర్హం. ఓ వైపు వాతవరణ కాలుష్యం తగ్గించాలంటే చెత్తను ఎక్కడ కూడ కాల్చవద్దు అని మున్సిపల్ అధికారులే ప్రచారం చేస్తారు. ఆ మేరకు మున్సిపల్ నిబంధనలు కూడా చెప్పుతున్నాయి. కానీ చింతకుంటలో మాత్రం యదేచ్చగా చెత్త పేరిగిపోతుందంటూ మున్సిపల్ అధికారులే చెత్తను కాల్చివేయటం విశేషం. ఓ వైపు నగరంలో డంప్‌యార్డులో చెలరేగుతున్న మంటల వల్ల స్థానికంగా ఉండే ప్రజలు అనారోగాల బారిన పడుతున్నారంటే చింతకుంటలో మాత్రం పారిశుద్ధ్య సిబ్బంది మంటలు పెడుతున్నారు. స్మశానవాటికలోనే చెత్త వేయటం వల్ల అంత్యక్రియలకు వస్తున్న ప్రజలకు తీవ్ర దుర్వాసన వస్తుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం అంత్యక్రియాల ప్రాంతాల్లో శాంతిగా దహన సంస్కారాలు కూడ చేయలేని దుస్థితి వస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.
రోడ్లపక్కనే చెత్త..
అలాగే నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్త ఆయా ప్రాంతాల్లోని వర్మి కంపోస్టు, డీఆర్సీసీ కేంద్రాలు తరలించి మిగిలిన చెత్తను స్థానికంగా ఉన్న డంప్‌యార్డులకు తరలిస్తారు. కానీ స్వచ్ఛ భారత్‌లో మెరుగైన ర్యాంకులు సాధిస్తామని చెప్పుకుంటున్న నగరపాలక పారిశుద్ధ్య అధికారులు మాత్రం నగరంలోని పలు రోడ్లకు ఇరువైపులే చెత్త పోయి చెతులు దులుపుకుంటున్నారు. నగరంలోని చింతకుంట నుంచి శాతవాహన యూనివర్సిటీ వెనుక నుంచి వచ్చే రోడ్డుకు ఇరువైపుల గత కొన్ని రోజులు పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను పారబోస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ రోడ్డులో ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పటికైనా నగరపాలక ఉన్నతాధికారులు విలీన గ్రామాల్లో సాగుతున్న పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకొవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.