కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 14: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో అన్నీ కాకి లెక్కలే ఉన్నాయని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న అంకెలు, రాష్ట్ర జనాభా వివరాలు ఏ లెక్కలతో పోల్చినా సరిపోవడం లేదని, మళ్లీ రీ సర్వే చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 75 ఏండ్లుగా బీసీలను మోసం చేస్తూ వెనక్కి నెడుతూనే ఉన్నారని మండిపడ్డారు. అన్ని రాష్ర్టాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ, తెలుగు రాష్ర్టాల్లో మాత్రం ఇప్పటివరకు ఆ అవకాశం దక్కలేదన్నారు.
బీసీల ఆర్థిక సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి, వారికి రిజర్వేషన్ల ఫలాలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2021లోనే వకుళాభరణం కృష్ణమోహన్ చైర్మన్గా బీసీ కమిషన్ను ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. సదరు కమిషన్ విస్తృతంగా అధ్యయనం చేసిందని, కానీ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కొంత ఆలస్యమైందని చెప్పారు. కేసీఆర్ నియమించిన కమిషన్ తన పూర్తి అధ్యయనం నివేదికను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మారడంతో కులగణన జరుగలేదన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన చేయాలని తాము అసెంబ్లీలోనూ డిమాండ్ చేశామని, అదే జరిగితే తాము స్వాగతిస్తామన్నారు. బిహార్లో శాస్త్రీయంగా కులగణన చేయక పోవడం వల్లే అక్కడి సర్వేను హైకోర్టు కొట్టివేసిందని, కర్ణాటకలోనూ ఇదే జరిగిందని చెప్పారు. గత మార్చిలో నిరంజన్ చైర్మన్గా బీసీ కమిషన్ను ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ సర్కారు ప్రకటించిందని, అది జరిగిన ఏడు నెలలకు ప్లానింగ్ బోర్డు ద్వారా కులగణన చేస్తున్నట్టు జీవో నంబర్ 18 జారీ చేసిందన్నారు. ఆ సమయంలో డెడికేటేడ్ కమిటీ ఇచ్చిన సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
అసెంబ్లీ ఆమోదించిన జీవో ప్రకారం ఏర్పాటైన బీసీ కమిషన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. శాస్త్రీయంగా కులగణన చేయకుండా అసెంబ్లీని మోసం చేశారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సర్వే జరిగితేనే న్యాయ స్థానాల్లో నిలబడుతుందన్నారు. ప్రభుత్వం అలా చేయకుండా సర్వేలో పాల్గొనని వారి నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తామంటూ ప్రభుత్వం మరోసారి తప్పటడులు వేస్తున్నదని మండిపడ్డారు. సర్వేలో ఏమైనా తప్పులు దొర్లాయా? అన్న వివరాలు తెలియాలంటే ముందుగా సర్వే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన సర్వే జరగాలంటే కులగణన రీసర్వే చేయాలన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తీసుకునే చర్యలకు తాము కూడా మద్దతు ఇస్తామని వివరించారు. అవసరమైతే కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. కానీ, బీసీ జాతిని మరోసారి మోసం చేయాలని చూస్తే సహించేది లేదని, బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, నాంపెల్లి శ్రీనివాస్, కచ్చు రవి, గుగ్గిళ్ల జయశ్రీ, మర్రి భవన, ఐలేందర్, శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
2011 కేంద్ర జనాభా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉన్నది. అలాగే ప్రతి పదేండ్లకోసారి తెలంగాణలో 13.8 శాతం రేషియో చొప్పున జనాభా పెరిగే అవకాశముందని ఆనాడే కేంద్రం చెప్పింది. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో 4.25 కోట్ల జనాభా ఉండాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సర్వేలో జనాభా లెక్కలు తగ్గించి చూపింది. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. అవమానించింది. ఇప్పటికైనా జరిగిన తప్పులను గుర్తించి రీ సర్వేచేయాలి. కొంత సమయం తీసుకున్నా సరే గానీ శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేయాలి.
– గంగుల కమలాకర్