కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్షన్నర మందిని తరలిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే సభ కోసం భారీ జనసమీకరణ చేస్తున్నామని, అనుగుణంగా ప్రణాళికలు వేసుకొని 10 రోజులుగా ఆచరణలో పెడుతున్నామన్నారు.
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాకు 400 ఆర్టీసీ బస్సులు, 200 ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రైవేట్ బస్సులు మొత్తం బుక్ చేస్తున్నామని చెప్పారు. ఇవి కూడా సరిపోవడం లేదని భావించి మహారాష్ట్రకు సంబంధించిన బస్సులు కూడా బుక్ చేశామన్నారు. కార్లు, ఇతర వాహనాలు ఏవి అందుబాటులో ఉంటే వాటిని బుక్ చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా అంటే తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎంతో అభిమానమని, కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ ఏర్పాటయ్యేది కాదని, బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.
కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తమ ఆస్తిగా భావిస్తారని, రాష్ర్టాన్ని తెచ్చిన. అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే కేటీఆర్ ఒకసారి కరీంనగర్లో ఉమ్మడి జిల్లా సన్నాహక సభను నిర్వహించారని, మరోసారి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్ష నిర్వహించేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ వస్తున్నారని తెలిపారు.
చింతకుంటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు పొన్నం అనిల్ కుమార్, అక్బర్ హుస్సేన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మైకెల్ శ్రీనివాస్, గందె మాధవి మహేశ్, నాగరాజు, రెడ్డవేని మధు, గడ్డం నాగరాజు, తిరుపతి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎందుకు నిలిచిపోయాయో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలి. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు ఆరాట పడుతున్నరు? దీనికి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ లేదు. నిధులు కేటాయించలేదు. భూ సేకరణ జరగలేదు. అయినా దానికోసం హైదరాబాద్‌లోని 150 మంది కార్పొరేటర్లను తీసుకుని సబర్మతికి సందర్శనకు వెళ్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. మా ప్రభుత్వ హయాంలోనే మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమయ్యాయి. టూరిజం నుంచి 100 కోట్లు, ఇరిగేషన్ శాఖ నుంచి 540 కోట్లు వచ్చిన జీవో ఉన్నది. అయినా ఈ పనులు ఎందుకు ఆగిపోయాయి? దీనికి మంత్రిగా పొన్నం సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపినట్టే దీనిని కూడా ఆపేస్తారా..? ఒక పక్క తీగల వంతెన చీకటిగా మారిపోయింది. కనీసం లైట్లు వేసే పరిస్థితి లేదు. వచ్చే జూన్‌లోగా పనులు పూర్తి చేసి రివర్ ఫ్రంట్‌లో నీరు నిలపాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నం.
– గంగుల కమలాకర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ రానున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జన సమీకరణపై ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్ష నిర్వహించనున్నారు. కరీంనగర్ శివారులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా, పార్టీ జిల్లా కార్యాలయానికి కేటీఆర్ మొదటిసారి విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, తదితర నాయకులు పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ చారిత్రాత్మకమైనది. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాయి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే ప్రజల మద్దతు కోల్పోయింది. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధించి, పదేళ్లలో ఊహించని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రజల మన్ననలు అందుకుంటున్నది. ఈ నేపథ్యంలో రజతోత్సవ సభకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. 1,200 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నాం. ఇక్కడి రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడమే కాకుండా వారి సొంత ఖర్చులతోనే చదును చేయిస్తున్నారు. మా పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రజల మద్దతుతో రజతోత్సవ సభ దిగ్విజయం అవుతుందనే నమ్మకం మాకు ఉన్నది. సభ నేపథ్యంలో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చెప్పారు. కరీంనగర్ నుంచి వెళ్లే వాహనాలు అల్గునూర్ తిమ్మాపూర్, నుస్తులాపూర్, కొత్తపల్లి, చిగురుమామిడి, హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ