కార్పొరేషన్, అక్టోబర్ 19: ‘కరీం‘నగరం’లో గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి, సీఎం అస్యూరెన్స్ నిధులతో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మారెట్ల అభివృద్ధి చేపట్టాం. పనులు తుదిదశకు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వీటికి సంబంధించి నిధులు మంజూరు చేయించాలని’ కోరుతూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి శనివారం కలెక్టర్ పమేల సత్పతికి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమై, పూర్తి కావస్తున్న టైంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని, దీనికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో చేపట్టిన అమృత వర్షిని సాంసృతిక కళా భవనం నిర్మాణం చివరి దశకు చేరిందని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలన్నారు.
కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో మూడు దశాబ్దాల క్రితం ఎస్సీ, బీసీ నిరుపేద కుటుంబాలకు సర్వే నంబర్ 272 ప్రభుత్వ భూమిలో ఇంటి పట్టాలు ఇచ్చారని, అందులో గృహ నిర్మాణాలకు అనుమతించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, జంగిలి సాగర్, నాయకులు జమీలొద్దీన్, తుల బాలయ్య, శ్యాంసుందర్ పాల్గొన్నారు.