జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 20 : విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వలవేసి, ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తారు. ఆపై నకిలీ వీసాలు అంటగట్టి, అడ్డదారుల్లో లావోస్‌కు తరలించి సైబర్ ముఠాలకు విక్రయిస్తారు. ఆపై బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తారు. వినకుంటే బెదిరింపులకు దిగుతారు. ఈ ముఠా బాగోతాన్ని జగిత్యాల పోలీసులు బట్టబయలు చేశారు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించి జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. మల్లాపూర్ మండలం ఒబులాపూర్ తండాకు చెందిన ఇస్లావత్ విజయేందర్ 2024లో లావోస్ వెళ్లాడు. అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాతో పరిచయం ఏర్పడి, అదే ముఠాలో చేరి మోసాలకు పాల్పడ్డాడు. తర్వాత ముఠాలో చేర్పిస్తే ఒక్కరి వద్ద నుంచి 13వేల యువాన్లు (1.75లక్ష) కమీషన్ ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో జగిత్యాల జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఎర వేశాడు.
ఉద్యోగాల పేరిట నమ్మించి ఒక్కొక్కరి నుంచి 75వేల నుంచి 1.05లక్షల వరకు వసూలు చేసి.. ముందుగా టూరిస్ట్ వీసాపై బ్యాంకాక్‌కు పంపేవాడు. అక్కడి నుంచి అక్రమ మార్గాల్లో వీరిని లావోస్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతానికి తరలించేవాడు. ఆ తర్వాత వీరి పాస్‌పోర్టులను లాక్కొని, వీరిని సైబర్ ముఠాలకు విక్రయించేవాడు. చైనా కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్ కాల్ సెంటర్లలో పనిచేయాలని సైబర్ ముఠా సభ్యులు బలవంతం చేసేవారు. అమెరికా ఇన్ఫ్లూయెన్సర్ పేర్లతో సోషల్ మీడియాలో నకిలీ ఐడీలను క్రియేట్ చేసి, యూస్తోపాటు ఇతర దేశాల్లో స్థిరపడ్డ భారతీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలు చేయించేవారు. పని చేయనని చెప్తే బెదిరింపులకు పాల్పడేవారు. అయితే విజయేందర్ చేతిలో మోసపోయిన జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లికి చెందిన అరవింద్ నానా కష్టాలు పడి స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఈ మోసంపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విజయేందర్ చేతిలో 1.05లక్షలు మోసపోయానని వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, విజయేందర్‌పై లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న విజయేందర్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగగా, పట్టుకుకున్నారు. విజయేందర్‌ను విచారించగా, ఆయనతోపాటు సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన మీసాల రాజశేఖర్, రంగపేటకు చెందిన దండుగుల కళ్యాణ్, ధర్మపురికి చెందిన శ్యామ్‌రావు రాజశేఖర్ సైతం ఉన్నట్టు గుర్తించారు.
విజయేందర్‌తోపాటు ఆ ముగ్గురి నుంచి సెల్ఫోన్లు, కీలక పత్రాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన మరో వ్యక్తి రాజు దావోస్‌లో ఉన్నాడని, త్వరలోనే అతడిని సైతం పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల విషయంలో నిరుద్యోగులు, యువకులు జాగ్రత్తగా ఉండాలని, అనుమతులున్న సంస్థలు, ప్రభుత్వం ప్రకటించే సంస్థలకు చెందిన వాటినే ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సెల్ డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐలు ఉమాసాగర్, దినేష్ పాల్గొన్నారు.