Peddapally | పెద్దపల్లి కమాన్, ఆగస్టు 28 : ముక్కోటి దేవతల తొలి పూజలందుకునే లంభోదరుడు భక్తులను ఆశీర్వదించేండుకు విచ్చేశాడు. జిల్లా లో బుధవారం గణేష్ నవరాత్రోత్స వాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల తో పాటు ఊరురా.. వాడ వాడలా అందంగా ముస్తాబైన మండపాల్లో గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు తొలి రోజు విగ్నేశ్వరుడి ప్రార్ధన, ఫల, పుష్ప పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ముప్పు వాటిల్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించడంతో ప్రజలు పర్యావరణ హిత మట్టి విగ్రహలను పూజించేందుకు మక్కువ చూపారు. రెండో రోజు గురువారం గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలువురు అన్నదానం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేనా ఆధ్వర్యంలో 61 అడుగుల భారీ మట్టి వినాయకుడ్ని ప్రతిష్టించారు. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మట్టి గణపతి కావడంతో, దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నట్లు యువసేనా అధ్యక్షుడు శివంగారి సతీష్ తెలిపారు.