కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 27: జిల్లా వ్యాప్తంగా బుధవారం గణేశ్ నిమజ్జనం కనుల పండువగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వినాయకులకు నవరాత్రులు విశేష పూజలు చేసిన భక్తులు వచ్చే సంవత్సరం వరకు తమను చల్లంగా చూడాలని వేడుకొని మొకులు చెల్లించుకున్నారు.
ఉదయం నుంచే మండపాల వద్ద ఉద్వాసన పూజలు జరుగగా మధ్యాహ్నం ఆయా ఉత్సవ కమిటీల సారధ్యంలో వాహనాలను విద్యుద్దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించి విఘ్నేశ్వరులను ఉంచారు.
డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు, మంగళ వాయిద్యాలు, మంగళ హారతులు, ఈలల ధ్వనుల మధ్య భజన, భక్తి పాటలు, కోలాటం, దాండియా, కర్ర విన్యాసాలు, శాస్త్రీయ జానపద నృత్యాలు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలతో గణేశ్ శోభాయాత్ర కొనసాగింది.
రాత్రి వరకు శోభాయాత్ర కొనసాగగా చెరువులు, నదుల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించిన గణేశ్ ప్రతిమలకు టవర్‌సర్కిల్, రాంనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనోత్సవ వేదికల వద్ద పూజలు జరిపి మానకొండూర్, కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కెనాల్లో నిమజ్జనం చేశారు.
నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూశారు. టవర్ సరిల్ వద్ద ఒకటో నంబర్ వినాయకుడికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. అనంతరం మిగతా విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లాయి.