ఓదెల : ఆది దేవుడు గణనాథుడి నిమజ్జనం ( Ganesh immersion ) సమయంలో పోలీసుల సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకోవాలని తహసీల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్ ( Tahsildar Dheeraj Kumar) , ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కాపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనం రోజున త్వరితగతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను నిమజ్జనాలకు తరలించాలన్నారు. ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని తెలిపారు. ఈత రానివారు, పిల్లలు, మహిళలు నీటిలోకి దిగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిమజ్జనం ఊరేగింపు దారి వెంట విద్యుత్ తీగలను గమనిస్తు ఉండాలని తెలిపారు.