కరీంనగర్ కలెక్టరేట్, జూలై 1 : దిక్కూమొక్కూ లేని పిల్లలకు తమ ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉంటుందంటూ అధికార నేతలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో అనాథ పిల్లలుంటే కేవలం వందల సంఖ్యలో మందికి మాత్రమే సంక్షేమ నిధులు విడుదల చేస్తూ, ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పిల్లలందరికీ సంక్షేమ పథకాలు అందక అనేక మంది ఆపన్న హృదయాల కోసం ఎదురుచూస్తున్నారు. తల్లిదండ్రులు లేని వారు, తల్లి లేదా తండ్రి లేని వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, 18 ఏళ్లలోపు వారికి ఆశ్రయం కల్పించేందుకు శిశుగృహ, బాలసదనంతోపాటు సంక్షేమ వసతి గృహాలు జిల్లా సంక్షేమశాఖ ఆధీనంలో కొనసాగుతున్నాయి.
ఐదేళ్లు నిండిన అనంతరం వీరికి చదువు చెప్పించడంతోపాటు ఆలనా పాలన కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. వయసుతో పాటు వారి చదువుకనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లో చేర్చుతూ విద్యాబోధన చేయిస్తున్నట్లు పేర్కొంటున్నా, జిల్లాలో మాత్రం అనాథ పిల్లలకు సరైన సేవలందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొద్దిమందిని నామమాత్రంగా మాత్రమే ఎంపిక చేస్తున్నట్లు ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులను బట్టి స్పష్టమవుతోంది. సంరక్షణతోపాటు కల్పించే సౌకర్యాలపైనా నిర్లక్ష్యం కనబర్చుతున్నట్లు వారికందిస్తున్న ఆరోగ్య సేవలను బట్టి తేటతెల్లమవుతోంది. ఆరోగ్యశ్రీ(ఆయుస్మాన్ భారత్) కార్డులతో పాటు అనాథలుగా ధ్రువీకరించే పత్రాలు కూడా అందించకపోవడంతో పైచదువులకు వెళ్తున్న వారు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
వివిధ రకాలుగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు, తల్లిదండ్రులు విడిపోయిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలల నుంచి జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ టీముకు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుండగా, అధికారులు మాత్రం 300 వచ్చినట్లు పేర్కొంటున్నారు. వీటిలో 200 మందికి మాత్రమే మిషన్ వాత్సల్య పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక సాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాయమందిన వారిలో 99 మంది బాలికలుండగా, 101 మంది బాలురు ఉన్నారు. వీరిలో వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన వారు 109 మంది, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 59 మంది, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఇద్దరు, జనరల్ కేటగిరీలో 13 మంది బాలలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో మిగతా వంద మంది ప్రభుత్వ సాయమందక పోవడంతో ఆవేదనకు గురవుతున్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో చేరిన తర్వాత విద్యార్థుల బాగోగులపై శ్రద్ధచూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనేక మంది అనాథ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డప్పుడల్లా వారికి సరైన వైద్య చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నట్లు హాస్టళ్ల కేర్టేకర్లు పేర్కొంటున్నారు. వైద్య ఖర్చులకు డబ్బుల్లేక, ఉచితంగా వైద్యం అందక నానా అగచాట్లు పడుతున్నట్లు చెబుతున్నారు. కొంతమంది కోవిడ్ అనాథలకు పీఎం కేర్స్ పథకం కింద డిపాజిట్ చేసిన డబ్బుల నుంచి వచ్చే వడ్డీని వారి వైద్య ఖర్చులు, చదువుల కోసం ఖాతాల్లో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నా ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని అనాథ పిల్లలు వాపోతున్నారు. వీరికి వైద్య సాయమందించేందుకు ఆరోగ్యశ్రీ (ఆయుష్మాన్ భారత్) కార్డులు విధిగా అందించాలనే ఆదేశాలున్నా సగం మందికి కూడా మంజూరు చేయకపోవడంతో, అనారోగ్యం బారినపడ్డ సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నగరంలోని ఓ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న అనాథ విద్యార్థి వెల్లడించడం గమనార్హం.