బంధం కోసం.. బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. తన వాళ్ల కోసం అహర్నిశలు కష్టపడుతూ.. భవిష్యత్తుకు బాటలు వేయడంలో మహిళలకు మరెవ్వరూ సాటిరారు! అలాంటి మహిళలకు అధికారం తోడైతే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారనడానికి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన.. చేస్తున్న కలెక్టర్లే నిదర్శనం! తమదైన శైలిలో పాలన కొనసాగించి.. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ప్రత్యేకతను చాటుకున్నారు. పురుష కలెక్టర్లకు మించిన పనితీరుతో ప్రజల గుండెల్లో చెరగని తమదైన ముద్ర వేసుకున్నారు. ఒకరు అక్షరాస్యతకు పెద్దపీట వేస్తే.. మరొకరు సిజేరియన్లకు అడ్డుకట్ట వేసి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించారు. ఇంకొకరు స్వచ్ఛభారత్‌లో జిల్లాను ఆదర్శంగా నిలిపారు. మరొకరు మహిళా ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి జిల్లా ఏర్పడిన 75ఏళ్లలో తమ ఆలోచనా విధానంతో సరికొత్త కార్యక్రమాలతో మార్పులకు శ్రీకారం చుట్టిన మహిళా కలెక్టర్లపై ‘నమసే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
కరీంనగర్, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాటి జిల్లాకు మొదటి కలెక్టర్‌గా 1950 నవంబర్ 21న పీకే దవ్వే నియమితులయ్యారు. అప్పటి నుంచి కొత్త జిల్లాలు ఏర్పడే వరకు అంటే.. 2016 అక్టోబర్ 11 వరకు 59 మంది ఉమ్మడి జిల్లాకు కలెక్టర్లుగా పని చేశారు. అందులో నలుగురు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. వీరిలో 2010 నుంచి 2011 మధ్య పనిచేసిన జీడీ అరుణ మినహా.. మిగిలిన ముగ్గురు కలెక్టర్లు సుమితా డావ్రా, స్మితా సబర్వాల్, నీతూ ప్రసాద్ తమదైన ముద్రవేశారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఒక ఐఏఎస్ తలుచుకుంటే పాలనా రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురావచ్చో ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో చూపించారు. ఇటు కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత వచ్చిన పలువురు మహిళా కలెక్టర్లు కూడా అదేబాటలో ముందుకెళ్తున్నారు. ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మహిళా సమస్యల పరిష్కారం కోసం ‘శుక్రవారం సభ’ పేరిట కార్యక్రమం చేపట్టి ప్రత్యేకంగా నిలిచారు. అలాగే కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నలుగురు మహిళా కలెక్టర్లు పనిచేయగా.. దేవసేన, అలుగు వర్షిణి పాలనా రంగంలో వారి ముద్రవేసుకున్నారు.
అక్షరాస్యతకు పెద్దపీట : సుమితా డావ్రా
సుమితా డావ్రా ఉమ్మడి జిల్లా పాలన పగ్గాలు చేపట్టే నాటికి అక్షరాస్యతా శాతం అట్టడుగు స్థాయిలో ఉన్నది. ఈ విషయాన్ని గమనించి అక్షరాస్యతకు పెద్దపీట వేశారు. గ్రామీణ మహిళలను చైతన్యవంతులను చేయడంపై ఆమె ఆనాడు దృష్టి పెట్టారు. విద్యాశాఖను ఏకం చేసి, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి బడులు నడిపించారు. మహిళలకు చదువుకోవడంతో వచ్చే లాభాలు, అది లేకపోవడం జరుగుతున్న నష్టాలను వివరించేందుకు మండలవారీగా మహిళా సభలను నిర్వహించారు.
అక్షరాస్యత పెంపుకోసం ప్రతి నెలకోసారి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఓవైపు గ్రామీణ స్థాయిలో మహిళలకు విద్యా బుద్ధులు నేర్పిస్తూనే మరోవైపు పదోతరగతి ఫలితాలు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానోపాధ్యాయులతో ముందుగానే మీటింగ్ పెట్టి, జిల్లాను అగ్రభాగంలోనిలిపేలా ప్రణాళికలు చేశారు. ఒక్కో సబ్జెక్టులో నిపుణులను రప్పించి, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆనాడు అక్షరాస్యతా శాతం పెరిగింది. మహిళల్లో చైతన్యం పెరిగిందని ఆనాడు నివేదికల్లో వెల్లడైంది. అక్షరాస్యతకు ఆమె తీసుకున్న చర్యలతో ‘సరస్వతీ పుత్రిక’ అనే పిలుచుకునే స్థాయికి ఎదిగింది.
ఇసుక పాలసీ రాష్ర్టానికే స్ఫూర్తి : అలుగు వర్షిణి
పెద్దపల్లి జిల్లాగా ఏర్పడ్డ తర్వాత తొలి కలెక్టర్‌గా అలుగు వర్షిణి నియమితులయ్యారు. జిల్లాలో విస్తరించి ఉన్న గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా తరలుతున్న ఇసుక రవాణాను కట్టడి చేసే దిశగా ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఒక వైపు అడ్డుకట్ట వేస్తూనే మరో వైపు ప్రభుత్వానికి నిధులు సమకూరేలా ఇసుక విధానం(సాండ్ పాలసీ)ని రూపొందించారు. ఎక్కడా నేరుగా ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వకుండా పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లింపులు జరిగేలా ఇసుక పాలసీని అమలు చేశారు. ఈ విధానం అనతి కాలంలోనే మంచి ఫలితాలు తీసుకువచ్చింది. మైనింగ్ శాఖకు కోట్లల్లో ఆదాయం సమకూరింది. రాష్ర్టానికే మోడల్‌గా మారగా, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అధికార బృందాలను ఇక్కడికి పంపారు. అమలు తీరును తెలుసుకొని ఆ జిల్లాల్లో శ్రీకారం చుట్టారు. క్రమంగా సాండ్ పాలసీని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది.
స్వచ్ఛతమార్గం.. అవార్డుల వరద : శ్రీదేవసేన
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేసిన శ్రీ దేవసేన పాలనలో ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ, స్వచ్ఛత కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేశారు. అందుకుగాను జిల్లాకు దాదాపుగా 12 జాతీయ అవార్డులు దక్కాయి. 2017లో బహిరంగ మల మూత్ర రహిత జిల్లాగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద శాతం శానిటేషన్‌లో భాగంగా శత శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు.
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వేలో 97.45మార్కులతో దేశంలో జిల్లా మూడో స్థానం, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో నిలిచి అవార్డును అందుకున్నది. 2019లో స్వచ్ఛ భారత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛత దర్భణ్లో భాగంగా స్వచ్ఛ సుందర్ సౌచాలయ్ అవార్డును పొందింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన రెండు సార్లు జాతీయ అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డును ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. ఇంకా వివిధ విభాగాల్లో జిల్లాలోని మండలాలు, గ్రామాలు సైతం దేశంలోనే ఉత్తమంగా నిలిచి పది జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి. గవర్నర్ తమిళిసైసౌందర రాజన్ స్వయంగా జిల్లాలో పర్యటించి స్వచ్ఛతను గురించి తెలుసుకున్నారు.
చెరగని ముద్ర : స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి జిల్లాలో సెక్షన్ ఆపరేషన్లు తీవ్ర స్థాయిలో జరిగేవి. ఆనాడు 88 శాతం సిజేరియన్లు అయ్యేవి. వీటి ద్వారా జరుగుతున్న దోపిడీతోపాటు మహిళలకు తలెత్తే సమస్యలను తెలుసుకున్న ఆమె, ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయడంపై ఫోకస్ చేశారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలపై గట్టి నిఘా పెట్టి.. సిజేరియన్లు కాకుండా చర్యలు తీసుకున్నారు. వైద్య శాఖను అప్రమత్తం చేసి.. ఆకస్మిక తనిఖీలు చేయించారు. అక్కడితో ఆగకుండా ప్రసూతి వివరాలను రోజువారీగా తెప్పించి ఆపరేషన్లు ఎక్కువ చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. తద్వారా ఆమె పాలనలో 60 శాతం వరకు సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండేలాగా వీడియో కాలింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. వసతిగృహాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్కైప్ వీడియో కాలింగ్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చి మంచి ఫలితాలు రాబట్టారు.
మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా విద్యారంగంలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశారు. ‘ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రుల్లారా.. నేను మీ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను. దయచేసి ఒక్క విషయం శ్రద్ధగావినండి. విద్యార్థి జీవితంలో పదోతరగతి అతి ముఖ్యమైన మెట్టు. దీనిని అధిగమిస్తే భవిష్యత్తులో ముందుకు వెళ్లగలం. ఉన్నత విద్యాసంస్థల్లో మీ పిల్లలు చేరడానికి నిరంతర కృషితో పరీక్షలకు సిద్ధం కావాలి. పరీక్షల సమయం దగ్గర పడింది. అందుకే మీ పిల్లలను కొన్నాళ్ల పాటు సరదాలు, సంబురాలు, టీవీలకు దూరంగా ఉంచండి. మీ పిల్లల గురించి మీరు కన్న కలలను సాకారం చేసుకోండి. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించే బృహత్ కార్యక్రమంలో మీరు, మేం అందరం భాగస్వాములం అవుదాం’ అంటూ ఆనాడు 32వేల మంది తల్లిదండ్రులకు ‘వాయిస్ ఎస్ఎంఎస్’ పంపించి చైతన్యం చేశారు. ఆ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించారు. అలాగే అవినీతిపై ఆమె ఓ యుద్ధమే చేశారు. ఒక్క మాటలో ప్రజాపాలన నుంచి మొదలు ప్రతి రంగంలోనూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
మహిళా సమస్యల పరిష్కారానికి కొత్త పంథా : పమేలా సత్పతి
గతేడాది అక్టోబర్ 30న కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి, మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. అనారోగ్య సమస్యలు కావచ్చు.. వ్యక్తిగత సమస్యలు కావచ్చు.. ఇతరత్రా సమస్యలు కావచ్చు.. కుంగిపోకుండా నిర్భయంగా చెప్పుకొనేలా ఒక వేదికకు రూపకల్పన చేశారు. అందులో భాగంగానే ‘శుక్రవారం సభ’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని 777 అంగన్వాడీ సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో కలెక్టర్ పాల్గొంటున్నారు. ‘కలెక్టర్ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం’గా దీన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్రస్థాయిలోనే మంచి గుర్తింపు పొందింది. ఏ జిల్లాలోనూ ఇలాంటి ప్రోగాం లేదు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు భాగస్వాములవుతున్నారు. రక్తహీనతతో బాధపడే మహిళలకు అవసరమైన మందులు, అనారోగ్యంతో బాధపడే మహిళలకు అవసరమైన పరీక్షలు, స్కానింగ్‌లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధులుంటే ముందుగానే గుర్తించి, నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా చైతన్యం చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తున్నారు. మంచి పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
ఇంటి పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తంగా వ్యక్తిగత సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలపై చర్చిస్తూ, పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండడంతో మహిళలు శుక్రవారం సభలను వినియోగించుకుంటున్నారు. జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 5116 మంది గర్భిణులు, 3536 మంది బాలింతలు, 3588 మంది ఆరు నెలలోపు చిన్నారులు, 24550 మంది ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు, 19521 మంది మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు, 19369 మంది కిశోర బాలికలు ఉన్నారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల పూర్తి సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా, విద్యారంగంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. ప్రధానంగా వసతి గృహాల్లో సమూల మార్పులు తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్నారు.
స్వచ్ఛ్భారత్కు పెద్దపీట : నీతూ ప్రసాద్
ఉమ్మడి జిల్లాకు నాలుగో మహిళా కలెక్టర్‌గా పనిచేసిన నీతూ ప్రసాద్, వివాదరహితురాలిగా.. అందరికి ఆప్తురాలిగా పేరు పొందారు. ఉద్యోగులు, సిబ్బందితో సన్నిహితంగా మెదిలారు. ఇక్కడ 21 నెలల పాటు పనిచేసిన ఆమె, స్వచ్ఛభారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో జిల్లాను అగ్రగ్రామిలో నిలిపారు. సిరిసిల్ల, పెద్దపల్లి, వేములవాడ నియోజకవర్గంలో వందశాతం మరుగుదొడ్లను పూర్తిచేసి రాష్ట్రంలోనే రికార్డు సాధించి చూపారు. ఆనాడు దేశ వ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో శ్రద్ధ చూపుతూ ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లిన 22 మంది కలెక్టర్లను చాంపియన్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ పేరిట కేంద్రం సన్మానించింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ గౌరవం నీతూప్రసాద్‌కు మాత్రమే దక్కింది. అప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. స్వచ్ఛభారత్ లోగోతో ముద్రించిన బ్యాట్ పై స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన కలెక్టర్ నీతూప్రసాద్‌కు అందించారు. నిరుద్యోగుల కోసం కూడా ఆనాడు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వారధి అనే సంస్థను ప్రారంభించి, దాని ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించారు. నేటికి కూడా వారధి ఎంతో మందికి ఉపాధి చూపుతున్నది. ఇటు ఎక్కువ సమీక్షలు నిర్వహించిన కలెక్టర్‌గానూ గుర్తింపు పొందారు. పోటీ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడమేకాకుండా, కలెక్టర్ క్రూషియల్ ఫండ్ నుంచి రూ.పది లక్షలు కేటాయించి అన్ని లైబ్రరీలకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపించారు. గోదావరి పుష్కరాలను పక్కాగా నిర్వహించడంలో ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు.