Friday Sabha | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 29 : మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం సభ వేదికగా మారుతుందని, అర్బన్ సీడీపీవో కే సబిత అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కిసాన్‌నగర్ సెక్టార్లో గల దుర్గమ్మగడ్డ మూడో ఆంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలతో పాటు మహిళలు విధిగా ఈ సభకు హాజరుకావాలని సూచించారు. తాము పడుతున్న ఇబ్బందులపై సభకు హాజరయ్యే ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తే, అప్పటికప్పుడే పరిష్కారమార్గాలు లభిస్తాయన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో షుగర్ బోర్డు ఏర్పాటు చేసినట్లు, తీసుకునే ఆహారంలో ఉండే చక్కెర శాతంపై, దీంతో వచ్చే అనారోగ్యాల పట్ల వివరించారు. వైద్యాధికారి ఇమ్రానాఖాన్ మాట్లాడుతూ, ఆరోగ్య మహిళ కార్యక్రమంలో జిల్లాలోని మహిళలందరికీ 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అనంతరం మెప్మా పీడీ స్వరూపరాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐసీపీఎస్ స్వప్న, మెప్మా శ్రీవాణి, 1098 పుష్పలత, రాజు, రేణుక, సతీష్, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎంలు పాల్గొన్నారు.