Friday Sabha | కరీంనగర్ కలెక్టరేట్, మే 02 : ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నశుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి అన్నారు. మహిళాభివృద్ధి. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మార్కండేయనగర్ లో గల అంగన్వాడీ-2 కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు.
ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ప్రతీ మహిళ శుక్రవారం సభలో పాల్గొని, తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య, కుటుంబ సమస్యలు కూడా అధికారులకు చెప్పుకోవాలని సూచించారు. సంబంధిత సిబ్బంది వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని, దీంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి మానసిక ఆందోళన తొలుగుతుందన్నారు. ప్రశాంత జీవనం గడిపే అవకాశముంటుందన్నారు. ఆరోగ్య సమస్యలపై అన్ని ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
చిన్నారులకు విద్యపై ఆసక్తి కలిగిస్తూ, వారిలో ఆలోచన పెంపొందించే క్రమంలో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ధీటుగా అంగన్వాడీలకు వచ్చే పిల్లలను తీర్చిదిద్దుతూ, వారిలో సృజనాత్మకత పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రక్తహీనత అరికట్టేందుకు చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని, నిర్దేశించిన మేరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
అర్భన్ సిడిపివో కె. సబిత మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఇల్లాలే ఇంటికి దీపమని, ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇంటిలోని సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు కార్యక్రమంలో డిఎంహెచ్ వో వెంకటరమణ, వైద్యాధికారి డా. సపూర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న, బీసీ సతీష్, ఎంఎస్ కే శ్రీలత, ఐసీపీఎస్ కవిత, అంగన్వాడీ టీచర్ బి.రమణతో పాటు గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.