Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 18 : రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే ఆరుణ శ్రీ ముఖ్యతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మెడికవర్ ఆస్పత్రి వైద్య సేవలను అభినందించారు. అనంతరం ఆస్పత్రి కార్డియలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ పాల్గొని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులతోపాటు స్థానికులకు బీపీ, షుగర్, 2డీ, ఏకో, ఈసీజీ తదితర గుండె పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గుండె జబ్బులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డాక్టర్ అనీష్ పబ్బ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతీ ముగ్గురిలో ఒకరికి షుగ్గర్ తప్పకుండా ఉంటుందన్నారు.
గతంలో 50 యేళ్లకు పైబడితే అరుదుగా గుండె జబ్బులు వచ్చేవనీ, ప్రస్తుతం వయసులో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్ద, ఆడ, మగ అందరికీ గుండె జబ్బులు రావడం సర్వసాధారణమైందన్నారు. జిల్లా నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు వచ్చేవారిలో అధిక శాతం రామగుండం వారే ఉంటున్నారన్నారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా నిత్య వ్యాయామం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడమే ఏకైక మార్గమన్నారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేనేజర్ కోట కరుణాకర్, అబ్ధుల్ వకీల్, విద్యాసాగర్, మనోజ్, యూనస్, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.