గొల్లపల్లి, నవంబర్1: ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటర్ వరకు చదువుకున్నది. ఐదు నెలల క్రితం ఓ పెద్ద కంపెనీలో పార్టమ్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ వచ్చిన ప్రకటన చూసి వారిని సంప్రదించింది. వారి మాయమాటలు నమ్మింది. వారు చెప్పనట్టుగా ఆన్లైన్లో 3.19 లక్షలు పంపించింది. అయినా వారు ఉద్యోగం కల్పించకపోవడంతో మోసపోయానని గ్రహించింది.
ఈ మేరకు గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరంగారెడ్డి, జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ సతీశ్, సైబర్ ఏఆర్ ఎస్ఐ కృష్ణ టీమ్ టెక్నికల్ టీమ్ సాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లికి చెందిన గౌరీశంకర్‌ను నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు గౌరీశంకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.