Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : వ్యవసాయ భూమి విక్రయిస్తామంటూ చెప్పి రూ.70 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ, బాధితులు ఓ రియల్టర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తొమ్మిదేళ్ళుగా తాము ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఇటు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా, అటు డబ్బులు ఇవ్వకుండా తమనే బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ, బాదితుల కుటుంధీకులు ఆయన ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. రియల్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కన్నీటి పర్యంతమయ్యారు. విషయం పోలీసుల దాకా చేరగా సంఘటనా స్థలికి వచ్చిన ఒకటో పట్టణ పోలీసులు బాధితుల వివరాలు, ఆందోళన చేయడానికి గల కారణాలు తెల్పుకుని సముదాయించే ప్రయత్నం చేశారు.
అయితే, తమకు డబ్బులిప్పిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ భీష్మించగా, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వగా ఇందోళన విరమించి పోలీసుల వెంట వెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ మండల కేంద్రానికి చెందిన చొప్పరి శ్రీనివాస్, ఆక్కనపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన బైరి చిరంజీవి అనే ఇద్దరు వ్యక్తులు జనగామ గ్రామ శివారులోని పలు సర్వేనంబర్లలో గల 9.18ఎకరాల భూమి కాళ్ళ రమేశ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద తొమ్మిదేళ్ళ క్రితం కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ, ఇందుకోసం రూ.70 లక్షల మొత్తం విడతల వారీగా నగదు రూపేణా వెల్లించినట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తుండగా, రమేష్ ను నిలదీయటంతో భూమి కోర్టు వివాదంలో ఉన్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. దీంతో, నెలన్నర క్రితం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళగా రూ. 80లక్షలు చెల్లిస్తానంటూ చెక్కు ఇచ్చాడని, అది కూడా బౌన్స్ కాపటంతో, ఇదేమిటని అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని, తెగేసి చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా తనకున్న రాజకీయ పలుకుబడితో అరెస్టు కాకుండా, పోలీసుల ఒత్తిడి నుంచి తప్పించుకుంటున్నాడని బాధితులు రోదిస్తూ చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో తమ కుటుంబాలతో వచ్చి నగరంలోని అలకాపురి కాలనీలో గల రియల్టర్ ఇంటి ఎదుట నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విషయం తెల్సుకున్న పోలీసులు ఆందోళనకారుల వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పగా, డబ్బులిచ్చే వరకు కదిలేదంటూ బాధితులు తెగేసి చెప్పారు.
సమస్యకు పరిష్కారమార్గం ఆందోళనలు, నిరసనలు కావని ఎస్ఐ రాజన్న బాధితులను సమురాయించగా, ఆందోళన విరమించి ఆయన వెంట పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ కాళ్ళ రమేశ్ భార్య లాస్య రెవెన్యూ శాఖలో ఆర్టగా హుస్నాబాద్ అక్కన్నపేట, కోహెడ మండలాల్లో గతంలో పనిచేయగా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రోద్బలంతోనే తాము భూమి కొనుగోలు కోసం తన భర్త రమేష్ కు డబ్బులిచ్చామంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా రమేశ్‌ను ఫోన్లో సంప్రదించగా, తనపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, భూ యజమానికీ నేరుగా డబ్బులు చెల్లించారని, సకాలంలో మిగతా డబ్బులు చెల్లించకపోవటంతో రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. భూయజమానుల పక్షాన తాను డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించి, రూ.52 లక్షల 50 వేలకు మాత్రమే బాండ్ పేపర్ రాసిచ్చినట్లు వెల్లడించారు. రూ.60 లక్షల మొత్తానికి బలవంతంగా చెక్కుపై సంతకం చేయించుకున్నారని, తనకు ఎవరి రాజకీయ అండదండల్లేవని స్పష్టం చేశారు.