Ramagundam | కోల్ సిటీ, జూలై 16 : పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గానూ అత్యధికంగా 721 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కాగా గురువారం ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈమేరకు గోదావరిఖని విఠల్ నగర్ లో గల ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి అలేఖ్య పటేల్ అభ్యర్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. కాగా, మొదటి రోజున వేమునూరు (జనరల్ రిజర్వేషన్) అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న 89 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
కాగా, కుందనపల్లి అంగన్వాడీ కేంద్రంకు అత్యధికంగా 376 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈనెల 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని సీడీపీఓ తెలిపారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా జరుగుతుందనీ, 20న తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కాగా, అభ్యర్థులకు నిర్ణయించిన తేదీల్లో ఒరిజినల్. జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలనీ, లేనిపక్షంలో అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.