పెద్దపల్లి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ,మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. రామగుండం నియోకవర్గంలో 210కోట్ల పనులు, పెద్దపల్లి నియోజకవర్గం లో మరో 150కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు. ఆయాచోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప ట్టాలు, ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమాలతో అమాత్యుడి పర్యటన ఆద్యంతం పండుగలా సాగగా, జిల్లాప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రామగుండంలో 210కోట్ల పనులకు శంకుస్థాపన
మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 2.50 గంటలకు గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియానికి చేరుకున్నారు. గోదావరిఖనిలో ఐటీ పార్కు, అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణ పనులకు సంబంధించి అక్కడే ఏర్పా టు చేసిన శిలాఫలకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 100 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల పైలాన్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఖురూజ్కమ్మీ భూములకు సంబంధించి 600 మంది పెద్దంపేట్, రాయదండి ప్రజలకు హక్కు పత్రాలు అందించారు. జీవో 76 ద్వారా సింగరేణి స్థలాల్లో అనేక ఏండ్లుగా జీవిస్తున్న కుటుంబాలకు, 58, 59జీవో ద్వారా మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ స్థలాల్లో అనేక ఏండ్లుగా నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు ఇచ్చారు. అలాగే, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, 3425 మందికి 4వేల చొప్పున ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన ఆదివారం ఉత్సాహంగా సాగింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పట్టాలు, ప్రొసీడింగ్‌లు, చెక్కుల పంపిణీ, సభలతో ఆద్యంతం పండుగను తలపించింది. ఆదివారం గోదావరిఖని, పెద్దపల్లిలో పర్యటించిన అమాత్యుడు, రామగుండం నియోజకవర్గంలో 210 కోట్ల పనులు, పెద్దపల్లి నియోజకవర్గంలో 150 కోట్లు చేపట్టిన, చేపడుతున్న పనులకు అంకురార్పణ చేశారు. గోదావరిఖనిలో ఐటీ పార్కు, అంతర్గాంలో ఇండస్ట్రీయల్ పార్కులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరణతోపాటు ఖురూజ్ కమ్మీ పట్టాలు, 58, 59,76 జీవోల ద్వారా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించి దశాబ్దాల కలను నెరవేర్చారు.
-పెద్దపల్లి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లిలో 150 కోట్ల పనులకు
రామగుండం పర్యటన తర్వాత సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. మొదటగా ఆర్అండ్బీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత కోటితో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 25 కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో రోడ్లు, డ్రైనేజీల పనులు, జిల్లా కేంద్రంలోని 50 లక్షల నిధులతో నిర్మించిన అమర్‌నగర్ జంక్షన్, రోడ్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్స్‌ను ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో 25 కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 100 కోట్లతో నిర్మించనున్న పనులను ప్రారంభించారు. అనంతరం గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఆ తర్వాత మున్సిపల్ చెత్త వాహనాలను ప్రారంభించారు.