సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11: పది వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అప్పారెల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతోనే ఇప్పుడు సిరిసిల్లలో టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీ అందుబాటులోకి వచ్చిందని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి కొనియాడారు. మహిళలకు ఉపాధి చూపాలనే లక్ష్యంతోనే పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. రాజన్న శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద నేతన్న చౌరస్తాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, 2022లోనే అప్పారెల్ పార్క్‌లో దాదాపు ఏడెకరాల స్థలం కేటాయించడంతోపాటు శంకుస్థాపన చేశారని చెప్పారు. గతంలోనే గోకుల్దాస్ కంపెనీ ఏర్పాటు ద్వారా 1,500మంది మహిళలకు ఉపాధి కల్పించారని కొనియాడారు. బెంగళూర్, తదితర రాష్ర్టాలలో ఏర్పాటు చేయాలనుకున్న టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీని కేటీఆర్ చొరవ తీసుకుని సిరిసిల్లకు తీసుకొచ్చారని వివరించారు. గోకుల్దాస్, టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీ ద్వారా దాదాపు 5వేల మందికి ఉపాధి లభించిందన్నారు. ‘వర్కర్ టూ ఓనర్’ పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 380కోట్లతో షెడ్లు నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ, టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీ ఏర్పాటులో కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకుండా ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ పేర్లను ఫ్లెక్సీల నుంచి తొలగించగలరేమో గానీ.. ప్రజల గుండెల్లో వారి స్థానాన్ని చెరిపివేయలేరని స్పష్టం చేశారు. అప్పారెల్ పార్క్ అందుబాటులోకి తెచ్చిందే కేటీఆర్ అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవుపలికారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ మాట్లాడుతూ, బృహత్తరమైన సంకల్పంతో గోకుల్దాస్, టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీలను సిరిసిల్లకు కేటీఆర్ తీసుకొచ్చారని కొనియాడారు.
టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఫొటో పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి, నాయకులు మ్యాన రవి, సత్తార్, దిడ్డి రాజు, లింగంపల్లి సత్యనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, పోచవేని ఎల్లయ్యయాదవ్, రాజిరెడ్డి, సుంకపాక మనోజ్‌కుమార్, రిక్కుమల్లె సంపత్, వెంకన్న, జక్కుల యాదగిరి, పోరండ్ల రమేశ్, సామల శ్రీనివాస్, మునీర్, బూర తిరుపతి, కాసర్ల పవన్ పాల్గొన్నారు.