తిమ్మాపూర్, జూన్ 25: తిమ్మాపూర్లోని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఆటోమెటిక్ వాహన టెస్టింగ్ సెంటర్ నిర్మాణం అటకెక్కింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాహన సామర్థ్య పరీక్షలు చేసేందుకు ఏఐ టెక్నాలజీతో కేంద్రం ఏర్పాటుకు సంకల్పించగా, శంకుస్థాపనకే పరిమితమైంది. మూడు నెలలైనా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలో కమర్షియల్ వాహనాలు వేలల్లో ఉన్నాయి.
వీటికి ఏటా ఫిట్నెస్ పరీక్షలు అవసరం. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం వాహనాలను ఏఎంవీఐలు, ఎంవీఐలు స్వయంగా చెక్ చేస్తుండగా రోజూ పెద్ద సంఖ్యలో వస్తుండడంతో పరీక్షించలేకపోతున్నారు. పైపైన మాత్రం చూసి పంపిస్తున్నారనే విమర్శలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని పలు రవాణా శాఖ కార్యాలయాల్లో అధునాతన యంత్రాలతో ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కేంద్రాల ద్వారా వాహనం టైర్లలో గాలి నుంచి ఇంజిన్ కండిషన్, పర్ఫామెన్స్, తదితర అన్ని భాగాలను ఏఐ టెక్నాలజీతో టెస్టు జరుగుతుంది. ఈ క్రమంలో సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రంలో తొలుత తిమ్మాపూర్లోని ఆర్టీఏ ఆఫీస్లో 8కోట్లతో మార్చి 24న మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు వచ్చి లాంఛనంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి వెళ్లారు. మూడు నెలలైనా ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పనులు ప్రారంభించాలని వాహనదారులు కోరుతున్నారు.