జగిత్యాల/ జగిత్యాల టౌన్, మే 7 : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ప్రభుత్వం కొనాలని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి పడిన అకాల వర్షానికి చల్గల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడువగా, బుధవారం ఆమె పరిశీలించారు. ధాన్యం అమ్మేందుకు తెచ్చి నెలల తరబడి నిరీక్షిస్తున్నామని రైతులు ఈ సందర్భంగా గోడు వెల్లబోసుకున్నారు.
తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీంతో రైతులతో కలిసి వసంత చల్గల్ మార్కెట్ ఎదుట ఉన్న నిజామాబాద్ జాతీయ రహరిదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. వర్షం వల్ల వరి రంగు మారినా, మొలకెత్తినా, తేమ శాతంతో సంబంధం లేకుండా, కొర్రీలు పెట్టకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని, వెంటనే హమాలీలను ఏర్పాటు చేసి రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.
బీఆర్ఎస్ హాయంలో చల్గల్ యార్డులో 20 నుంచి 30 మంది హామాలీలు పనిచేశారని, ప్రస్తుతం 10 మంది కూడా దిక్కులేరన్నారు. కొనుగోళ్లు సరిగా లేకపోవడంతో ఆకాల వర్షం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. దాదాపు గంటపాటు ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోగా, అదనపు కలెక్టర్ బీఎస్ లత వచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో చల్గల్, మోరపల్లి, హస్నాబాద్, జగిత్యాల రూరల్ రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.