Former sarpanch Suicide | గొల్లపల్లి, జూన్ 24 : సర్పంచ్‌గా తన పదవి సమయంలో అప్పులు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు చేసిన పనుల బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బీబీరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని బీబీరాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య (50) తన సర్పంచ్ పదవి కాలంలో గ్రామాభివృద్ధి కోసం సుమారు రూ.10 లక్షలు అప్పు చేసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
అయితే ఆ పనులకు సంబంధించి ప్రభుత్వం నుండి బిల్లులు రాలేదు. దీంతో చేసిన అప్పు తీర్చలేక మనస్థాపానికి గురై ఆదివారం తన మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం జగిత్యాలకు తరలించి వైద్యం చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.