కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 6 : నేటి యువతరం ప్రొఫెసర్ జయశంకర్ సర్‌ను నిత్యం స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. ప్రొఫెసర్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఆయన విగ్రహానికి మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో కలిసి వినోద్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జయశంకర్ ఆశయాలను 30 ఏళ్ల కిందట విన్నానని, 1994 కాలంలో తెలంగాణ పదం ఉచ్చరించాలంటే భయపడే రోజులని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు.
సమైక్య రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తి అని, తెలంగాణ సమస్యల విషయంలో కేసీఆర్‌కు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌తోనే సాధ్యమని జయశంకర్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారని, ఆయన బతికి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్దించకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ప్రొఫెసర్ ఆశయాలు నెరవేరాయని చెప్పారు. సార్ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. ఈరోజు అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు.