కాంగ్రెస్ జనహిత యాత్ర పేరిట చొప్పదండి నియోజకవర్గంలో నిర్బంధకాండ కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ సర్పంచులే టార్గెట్‌గా పోలీసుల అత్యత్సాహం కనిపించింది. పాదయాత్రను అడ్డుకోబోమని చెప్పినా వినకుండా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగింది. ఆదివారం ఉదయమే ఇండ్లకు వెళ్లి, అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించగా, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ‘మీనాక్షి నటరాజన్ గో బ్యాక్’ పేరిట సోషల్ మీడియాలో మెస్సేజ్‌లు వైరల్ అయ్యాయి.
గంగాధర/ రామడుగు/ కొడిమ్యాల/ మల్యాల/ బోయినపల్లిరూరల్, ఆగస్టు 24 : కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ జనహిత పాదయాత్ర నిర్వహించారు. చొప్పదండి నిజయోజకవర్గంలోని గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామం నుంచి కురిక్యాల మీదుగా గంగాధర ఎక్స్ రోడ్డు వరకు కేవలం ఐదంటే ఐదు కిలో మీటర్లు నడిచి మమ అనిపించారు. అయితే ఈ యాత్ర సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
పాదయాత్రను అడ్డుకుంటామని ఎక్కడా పిలుపునివ్వకపోయినా బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ సర్పంచులను నిర్బంధించారు. ఆదివారం ఉదయమే వారి ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. తాము చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని కోరుతూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు కలిసేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.
గంగాధరకు వెళ్లే దారుల్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకుని కార్నర్ మీటింగ్ జరిగే గంగాధర ఎక్స్ రోడ్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇటు బోయినపల్లి-గంగాధర ప్రధాన రహదారిపై, అటు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై కొండన్నపల్లి వద్ద భారీగా మోహరించి అనుమానితులు, మాజీ సర్పంచులను అడ్డుకున్నారు.
యూరియా కొరత తీర్చాలని ప్లకార్డు పేపర్‌ను జేబులో పెట్టుకొని మధురానగర్ చౌరస్తాలో బిల్డింగ్ ఉన్న నారాయణపూర్ తాజా మాజీ సర్పంచ్ ఎండీ నజీర్‌ను అదుపులోకి తీసుకొని, బోయినపల్లి మండలకేంద్రానికి సమీపంలో వదిలిపెట్టారు. మరోవైపు అధికార పార్టీ తీరుపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా.. లేదా..? అని తెలుసుకునేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పిన అధికార పార్టీ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంకోవైపు తాజా మాజీ సర్పంచులు సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకున్నారు. ‘మీనాక్షీ నటరాజన్ గో బ్యాక్’ అంటూ మేసేజ్‌లు పంపించారు. తమ బాధలు వినకుండా, పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులు చెల్లించకుండా పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఇంత మాత్రం దానికి జనహిత పాదయాత్ర ఎందుకని ప్రశ్నించారు.
హామీలు నెరవేర్చలేదన్న భయంతోనే : మాజీ ఎమ్మెల్యే సుంకె
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఆదివారం ఉదయం గంగాధర మండలం బూరుగుపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన సెల్ఫోన్లు కూడా వాడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్య పరిష్కరించాలని కోరితే అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకుంటామని తాము ఎక్కడా పిలుపునివ్వలేవని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న భయంతోనే అధికార పార్టీ అక్రమ అరెస్టులు చేయిస్తున్నదని ధ్వజమెత్తారు.