మల్యాల, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీదండు కదం తొక్కాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం మల్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండల నాయకులతో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కొడిమ్యాల మండలం మండలంలోని హిమ్మత్‌రావుపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ నెల27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. గులాబీ శ్రేణులు గ్రామగ్రామనా పార్టీ జెండాను ఆవిష్కరించి, సభకు బయలుదేరాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని విమర్శించారు. పదహారు నెలల పాలనలో చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నదని మండిపడ్డారు. అయినా బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్రావు, మధుసూదన్‌రావు, బద్దం తిరుపతిరెడ్డి, అయిల్నేని సాగర్‌రావు, జగనం శ్రీనివాస్, సామల్ల దేవరాజం, అల్లూరి అనిల్‌రెడ్డి, తైదల శ్రీలత, ఎడిపల్లి అశోక్, గడ్డం రాజేశం, జోగినిపల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.