తిమ్మాపూర్, నవంబర్16 : మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారూ.. ఇంకెన్నాళ్లూ అబద్ధాలు చెబుతూ యువకులు, ప్రజలను మభ్యపెడుతారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గుండ్లపల్లి – పొత్తూరు డబుల్ రోడ్డు పనులను అడ్డుకున్నది మీరు కాదా..? అని ప్రశ్నించారు. గన్నేరువరం ప్రజల ఆగ్రహానికి గురికాక ముందే పనులు ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఆదివారం వరకు రోడ్డు పనులు ప్రారంభించకపోతే తాను మరో మహాధర్నాకు పిలుపునిస్తానని హెచ్చరించారు. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం గన్నేరువరం మండల యువజన సంఘాల నాయకులు ఆదివారం మహాధర్నాకు పిలుపునివ్వగా.. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
అయితే అందులో ఉన్నవన్నీ అబద్ధాలేనని మాజీ ఎమ్మెల్యే రసమయి కొట్టిపారేశారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టిన యువజన సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గన్నేరువరం మండలంగా ఏర్పాటైందన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉందని, డబుల్ రోడ్డు కావాలని అక్కడి ప్రజలు తనను అడ్డుకొని ధర్నా చేస్తే వెంటనే తొలి సీఎం కేసీఆర్‌కు వివరించి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సహకారంతో 72కోట్ల జీవో తెచ్చానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఒక వీడియోలో మాట్లాడుతూ, ఆయనే రోడ్డు సాంక్షన్ చేయించినట్టు చెప్పాడని ఎద్దేవా చేశారు.
తాము అప్పుడు సాంక్షన్ చేసి, టెండర్లు లేకుండా రోడ్డు నిర్మాణానికి కొండాపూర్ దాకా మట్టి, కంకర ఎట్ల పోశామన్నారు. తాము సాంక్షన్ తెచ్చిన రోడ్డు పనులు ప్రారంభం అయ్యేలోపే ఎలక్షన్లు వచ్చి ఆగిపోయాయని వివరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రోడ్డుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్‌కు రాలేదని, ప్రభుత్వం మారిన తర్వాత గన్నేరువరం రోడ్డు ఆర్అండ్బీ శాఖ ద్వారా ఆపారని, మళ్లీ మీరే ప్రారంభించాలని జీవో కాపీ ఇచ్చారని చెప్పారు.
ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇవే కాకుండా నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు ఆగిపోయాయని వెల్లడించారు. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు, ప్రాసెస్ తెలియకపోతే సెక్రటరీయేట్ వచ్చి చెబుతానన్నారు. గన్నేరువరం రోడ్డు గురించి జైలుకుపోయానని చెప్పే కవ్వంపల్లి.. ఇప్పుడు తాను జైలుకెళ్తే పనులు చేస్తాడో లేదో చెప్పాలన్నారు. అంతేకానీ, అబద్ధాలు మాట్లాడవద్దని, యువకులను అవమాన పరచవద్దని హితవు పలికారు. ఆదివారం చేపట్టిన ధర్నాకు వచ్చేవాళ్లను భయపెట్టినా వారు పట్టుదలతో ప్రభంజనం సృష్టించారన్నారు.