Former MLA Rasamayi | తిమ్మాపూర్, సెప్టెంబర్22: రాంలీలా వేడుకల పేరిట అధికార పార్టీ నాయకులు అందరి దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిమ్మాపూర్‌లోని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వేడుకల సాకుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఇప్పుడు రాజకీయ కుట్రల బారిన పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పండుగను నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో కరువైందన్నారు. సామాన్య మహిళలు యూరియా కోసం లైన్లలో నిలబడుతున్నారని విమర్శించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు ప్రజలు ఈ పండుగను జరుపుకోవడానికి భయపడే స్థితి ఏర్పడిందని ఆరోపించారు. బతుకమ్మను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చేలా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, తగిన ఏర్పాట్లు చేయకుండా, చంద్రబాబు ఆదేశాలతో పండుగను నిర్వీర్యం చేస్తున్నారని రసమయి ఆరోపించారు.
సంస్కృతిని చెరిపేసే కుట్ర..
తెలంగాణ సంస్కృతిని చెరిపేసే కుట్ర జరుగుతోందని రసమయి ఆరోపించారు. ఈ పండుగ ద్వారా ప్రకృతిని దేవతలుగా ఆరాధించే సంప్రదాయాన్ని నాశనం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు రామలీలా కార్యక్రమాల పేరుతో రూ.1.15 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ నిధులను సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉపయోగించకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, మహిపాల్ రెడ్డి, నాయిని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, వేల్పుల మల్లయ్య, నగునూరి బాబు, మాతంగి అంజయ్య, కవంపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.