మంథని, ఆగస్టు 25: ‘కాంగ్రెస్ అంటేనే మోసం.. దగా.. నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీది అదే చరిత్ర’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ఆదివారం బీపీ మండల్ జయంత్యుత్స వాలను ఘనంగా నిర్వహించారు. మంథనిలోని ఆయన విగ్రహానికి మధూకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం కామారెడ్డి బీసీల డిక్లరేషన్‌ను అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ హకుల దీక్షను చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత తొలి ప్రధాని నెహ్రూ పూటకో మాట మాట్లాడి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డారన్నారు. 2వేల ఎకరాల భూస్వామిగా ఉన్న బిందేశ్వరి ప్రసాద్ మండల్ దేశమంతా తిరిగి బీసీల కష్టాలు తెలుసుకుని బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తిచేశారని గుర్తు చేశారు.
1990లో ఆయన ఇచ్చిన నివేదిక మేరకు వీపీ సింగ్ అమలు చేస్తానని ప్రకటిస్తే అప్పటి కాంగ్రెస్ సర్కారు వద్దని కోర్టుకు పోయిందన్నారు. కానీ సుప్రీంకోర్టు వారి వాదనను తిరస్కరించడంతో 1992లో బీపీ మండల్ రిపోర్ట్ ఆధారంగా 22శాతం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఒక మాట..ఎన్నికల తర్వాత మరోమాట మాట్లా డి మభ్యపెడుతున్నారన్నారు. ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. బీసీలంతా మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇందులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, నాయకులు తగరం శంకర్‌లాల్, ఎగోలపు శంకర్‌గౌడ్, పూదరి సత్యనా రాయణగౌడ్, కనవేన శ్రీనివాస్‌యాదవ్, సెగ్గెం రాజేశ్, మంథని లక్ష్మణ్, బత్తుల సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, మాచీడి రాజుగౌడ్, ఆరెపల్లి కుమార్, ఆడిచర్ల సమ్మయ్య, బీసీ సంక్షేమ సంఘం పొన్నం నవీన్, తోట రాజ్‌కుమార్ ఉన్నారు.