Singareni | గోదావరిఖని : సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కార్మికులను చివరకు అధికారులను సైతం ఇబ్బందులు పాలు చేస్తోందని మండిపడ్డారు.
మూడేళ్ల పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని, శాంతియుత మార్గంలో అధికారులు చేపట్టిన దీక్షలకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. గతంలో ఎప్పుడు అధికారులు ఇటువంటి ఆందోళనలను చేపట్టలేదని దీనిని చూస్తే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు అధికారులకు బాసటగా నిలుస్తామని వారు సందర్భంగా స్పష్టం చేశారు. CMOAI, SCCL బ్రాంచ్, BEC మార్గదర్శకత్వంలో ఆర్జీ-1 ఏరియా అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో మంగళవరం ఆరుగురు సీనియర్ అధికారులు నిరాహార దీక్షలో కూర్చున్నారు.