జగిత్యాల రూరల్, నవంబర్ 8: రైతుల్లో భరోసా నింపేందుకే రైతు పాదయాత్ర చేస్తున్నామని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం పని చేయకపోతే అడిగే హకు తమకు ఉందని, రైతుల పక్షాన కొట్లాడుతామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా.. హామీలు నెరవేర్చకుండా రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. అందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా ఈ నెల 12న ఉదయం 8.30 గంటలకు కోరుట్ల నుంచి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో కోరుట్ల, మోహన్‌రావుపేట, మేడిపల్లి, చలిగల్ మీదుగా జగిత్యాల కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు.
కొత్త బస్టాండ్ వద్ద సమావేశం అనంతరం రైతులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. పార్టీలకతీతంగా అందరూ పాదయాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. చలిగల్ వద్ద నుంచి పాదయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనరసింహా రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
రైతుల పక్షాన ఈ పాదయాత్ర చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం రైతులను మోసం చేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిది పాదయాత్ర కాదని.. పాపపు యాత్ర అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు పాదయాత్రలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ దేవస్థానంలో సీఎం పొర్లుదండాలు వేసి.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు గట్టు సతీశ్, శీలం ప్రియాంక, హరిచరణ్‌రావు, సంగెపు మహేశ్, స్పందన, ఆనందరావు, ప్రసాద్ ఎండబెట్ల, గంగారెడ్డి, తుమ్మ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.