మల్లాపూర్, జూన్ 10: బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, ఉద్యమకారుడు తెలంగాణ (గోల్కొండ) తుక్కన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు భరోసానిచ్చారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కలత చెంది మొగిలిపేటకు చెందిన తుక్కన్న మృతి చెందగా.. సోమవారం ఆయన కుటుంబసభ్యులను విద్యాసాగర్‌రావు పరామర్శించారు.
తుక్కన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తుక్కన్న యువకుడిలా పోరాటం చేశాడని, చురుకైన పాత్ర పోషించాడని కొనియాడారు. పార్టీకి అందించిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజు, సింగిల్‌విండో మాజీ చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓస సత్తెమ్మ, తదితరులు ఉన్నారు.