కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 9 : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శాసనసభా స్పీకర్ పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతమైన నిర్ణయం తీసుకున్నప్పుడే ప్రజలు హర్షిస్తారన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం.. మళ్లీ ఆ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం కంటే నీచమైనది ఇంకేది ఉండదన్నారు.
రాజకీయాల్లో విలువలు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక, రాజకీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. ఫిరాయింపులపై న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన రావడం బాధాకరమని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై యావత్తు తెలంగాణ ఎదురు చూస్తోందన్నారు.
హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్తామని, సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి కడియం కోర్టు తీర్పుపై కామెంట్ చేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి పదవి కోసమే రేవంత్‌రెడ్డి పకన దానం నాగేందర్ చేరాడని విమర్శించారు. ఇలాంటి నాయకులకు ఓటు వేసేటప్పుడు ప్రజలు సైతం ఆలోచించాలని సూచించారు.