జగిత్యాల, జూలై 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సొమ్మును గుజరాత్ రాష్ట్ర వ్యాపారులకు రాష్ట్ర సర్కారు అప్పనంగా దోచిపెట్టిందని, అందుకోసమే కొత్తగా పీఎంయూ విధానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. తకువ ధరతో నాణ్యమైన వస్తువులు వస్తాయంటూ నమ్మించి స్కామ్‌కు, తెరలేపిందని టెండర్లలో గోల్మాల్ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకం చూస్తుంటే టెండర్లు వేసిన కంపెనీలు, హక్కులు సాధించిన గుజరాత్ కంపెనీలన్నింటి వెనకాల సీఎం సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కొడుకుతోపాటు ఏపీకి చెందిన వ్యక్తులు ఉండి చక్రం తిప్పారని విమర్శించారు.
నాడు గురుకులాలు మార్గదర్శకంగా నిలిచాయని, ఇప్పుడు వాటిని అవినీతి కేంద్రాలుగా, స్కామ్‌ల సెంటర్లుగా కాంగ్రెస్ మార్చివేసిందని ధ్వజమెత్తారు. టెండర్ డాక్యుమెంట్లు, కొరిజాండమ్స్, టెండర్ కమిటీ మినిట్స్, అర్హత ప్రమాణాలు, పాత, కొత్తధరల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొప్పుల మాట్లాడారు.
నాడు కేసీఆర్ సర్కారు ఆదర్శవంతమైన గురుకులాలను ఏర్పాటు చేసిందని, విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు, పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. జిల్లాను యూనిట్‌గా చేసుకొని కలెక్టర్ల నేతృత్వంలో డీపీసీ (డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ) విధానాన్ని ఏర్పాటు చేసి, స్థానిక వ్యాపారులతో సరుకులను పంపిణీ చేయించిందన్నారు. కానీ, కాంగ్రెస్ సర్కారు ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ విధానాన్ని అమలులోకి తెచ్చి నిధుల దోపిడీకి తెరలేపిందని ధ్వజమెత్తారు.
స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు టెండర్లలో పాల్గొనలేని విధంగా నిబంధనలను రూపొందించిందని చెప్పారు. ట్రంక్ పెట్టెల సరఫరా టెండర్లను చూస్తే.. బ్యాంకు నుంచి రూ.10కోట్లు సాల్వెన్సీ చూపించాలని, అలాగే మరో రూ.10 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలన్న నిబంధనను విధించిందన్నారు. అలాగే టై, బెల్ట్, సూల్ బ్యాగ్, నోట్‌బుక్స్, షూస్ సంబంధించిన టెండర్లల్లోనూ ఇలానే నిబంధనలు పెట్టారన్నారు. టెండర్ దకిన 45 రోజుల్లోనే వస్తువులన్నింటినీ సరఫరా చేయాలని, టెండర్లలో పాల్గొనే వ్యాపారులు ఈఎండీలుగా కోట్ల రూపాయలను చెల్లించాలన్న నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ బడా కంపెనీలకు, ఏజెన్సీలకే అనుకూలంగా ఉన్నాయన్నారు. గత పదేళ్లలో సరకులను పంపిణీ చేసిన ఏ వ్యాపారికి ఈ టెండర్లలో పాల్గొనేందుకు అర్హతలు లేవన్నారు.
ప్రభుత్వ నిర్వాకం వల్ల గురుకులాలకు వస్తువులను పంపిణీ చేసే టెండర్లన్నీ బడా కంపెనీలకే దకాయని, తొమ్మిది వస్తువుల కోసం మొత్తంగా 28 ఏజెన్సీలు టెండర్లను దాఖలు చేస్తే కేవలం 13 ఏజెన్సీలే టెండర్ బిడ్డింగ్‌కు అర్హత సాధించాయన్నారు. ఐదు వస్తువులకు సంబంధించిన పంపిణీ టెండర్లు గుజరాత్‌కు కంపెనీలకే దక్కాయని, రెండు వస్తువుల పంపిణీ హక్కులు ఉత్తర భారత దేశానికి చెందిన వ్యాపారుల పాలయ్యాయన్నారు. ప్రధానంగా యూనిఫామ్స్ క్లాత్ టెండర్, పీటీ, నైట్ డ్రెస్, ట్రంక్ బాక్స్ టెండర్లు, బెడ్‌షీట్, బ్లాంకెట్ సరఫరా టెండర్లు గుజరాత్‌కు చెందిన ఒకే కంపెనీ దకించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు.
ఐడీకార్డు, స్టేషనరీ కిట్ వర్ ఆర్డర్‌ను గుజరాత్‌కు చెందిన ఓ అనామక కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. స్కూల్ బ్యాగ్స్, బూట్లు, సాక్స్‌ల వర్ ఆర్డర్‌ను సైతం గుజరాత్ కంపెనీకే అప్పగించారని తెలిపారు. ఐదు వస్తువుల సరఫరాకు సంబంధించి టెండర్లను దక్కించుకున్న కంపెనీలన్నీ ఒకే జీఎస్టీ నంబర్‌తో మహారాష్ట్రలోనూ కొనసాగుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రూ.1200 కోట్ల వర్ ఆర్డర్లో రూ.1100 కోట్ల వరకు గుజరాత్ కంపెనీలకే రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. ఒకే ఏజెన్సీకి రూ.600 కోట్ల వర్ ఆర్డర్‌ను ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, అది జీవో నంబర్ 1కు వ్యతిరేకంగా ఉందని పలు చేనేత సంఘాలు కోర్టును ఆశ్రయించాయన్నారు. ఆ మేరకు బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్, యూనిఫాం క్లాత్ కొనుగోలు టెండర్‌ను, యూనిఫాం క్లాత్, బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన ఓపెన్ టెండర్‌ను హైకోర్టు రద్దు చేసిందన్నారు. సర్కారు చేసిన దిక్కుమాలిన చర్యతో రాష్ట్రంలోని సుమారు 17,069 హ్యాండ్‌లూమ్‌లు, వాటిపై ఆధారపడిన సుమారు 40 వేల మంది చేనేత కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
టెసో ద్వారా యూనిఫామ్‌లు, వస్త్రాలను కొనుగోలు చేయాలని గతేడాది మార్చిలో జీవో 1ను జారీ చేసిన రేవంత్ సర్కారు, ఆ జీవోనే ఏడాదిలోపే తుంగలో తొక్కిందన్నారు. టీజీఎల్ఐపీసీఎల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో, జీవో నంబర్ 110కు విరుద్ధంగా 2026- 27 విద్యా సంవత్సరానికి అవసరమైన సూల్ బ్యాగులు, షూస్, సాక్స్, టైలు, బెల్టుల కొనుగోలుకు ప్రభుత్వం జారీ చేసిన ఓపెన్ టెండర్‌ను హైకోర్టు రద్దు చేసిందన్నారు. టీజీఎల్ఐపీసీఎల్/ లిడ్‌క్యాప్, ద్వారా కొనుగోలు చేయాల్సిన లెదర్ ఉత్పత్తులకు అవకాశాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు.
టెండర్లలో గుజరాత్‌కు చెందిన మఫత్‌లాల్ కంపెనీకి ప్రత్యక్షంగా రూ.639 కోట్లు, పరోక్షంగా రూ.1199 కోట్ల విలువ చేసే, స్కూల్ బ్యాగ్‌లు, ట్రంక్ పెట్టెలు, ఐడీ కార్డులను అందజేసే ప్రావిజన్‌ను కట్టబెట్టారన్నారు. డీవోపీటీ నిబంధనల ప్రకారం గురుకులాల సొసైటీకి కచ్చితంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి పనులు చేపట్టాల్సి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించలేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 17 తెలంగాణకు చెందిన చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, దళిత పారిశ్రామికవేత్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అవకాశాలకు గొడ్డలిపెట్టు అని అన్నారు. టెండర్లలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడితే ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
టెండర్లపై చర్చకు సిద్ధమంటూ ప్రకటించి, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ చేసి, ఆ తర్వాత డ్రామాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును విమర్శించడం అర్ధరహితమన్నారు. టెండర్లలో జరిగిన స్కామ్‌పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.