జగిత్యాల, జూన్ 30 : బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమని, అవి మళ్లీ అమలు కావాలన్నా.. అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తెచ్చిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కేసీఆర్ కిట్ పథకం స్ఫూర్తితోనే తమిళనాడు సీఎం విజయ్ సర్కార్ దవాఖానలో పుట్టిన పిల్లలకు గ్రాము బంగారం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారని కొనియాడారు. సీఎం అంటే కేసీఆర్‌లా గుర్తింపు తేవాలని చెప్పారు.
కానీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం పదవి గౌరవాన్ని దిగజార్చాడని, ఆయనను సీఎంగా దేశంలో ఎవరూ గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతున్న ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి’ అనే నినాదం జగిత్యాల నుంచే మొదలైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారని, అందుకు మనమందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7న జగిత్యాలలో నిర్వహించే కేటీఆర్ సమావేశానికి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హజరు కావాలని కోరారు.
మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు రాయికల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా జీవన్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజాపక్షం అన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని, ప్రజా సమస్యలను వెలికితీసి అధికార పక్షం ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రజాపక్షమైన బీఆర్ఎస్పై ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ప్రజల్లో కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తమవుతుందన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ కార్యరూపం దాల్చడం లేదని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆగిపోతున్నాయని వాపోయారు.
రేవంత్‌రెడ్డి తన వారికి ఒక పద్ధతి, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మరో పద్ధతి అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా కేసీఆర్ బీడీ పెన్షన్‌ను అమలు చేస్తే.. 30 పాలనలో కొత్తగా ఏ ఒక్క బీడీ కార్మికురాలికి పెన్షన్ ఇవ్వలేదన్నారు. నాడు ఆంక్షలు లేకుండా రైతుబంధు ఇస్తే.. రేవంత్ రెండు ఎకరాలకు ఇచ్చి మిగిలిన వారికి ఎగవేశాడని మండిపడ్డారు. రైతు బీమా ప్రీమియానికి కూడా మంగళం పలికాడని ఆగ్రహించారు. ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా కోసం దాదాపు 8వేల కుటుంబాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాయని ఆవేదన చెందారు.
ధాన్యం క్వింటాల్‌కు సుమారు 8 కిలోల చొప్పున కోత పెట్టి, సగటున ఎకరానికి ఆరు వేలు దోపిడీ చేశారని, ఉన్న మాట అంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉలికిపడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో వెలుగు వెలిగిన పల్లెలు నేడు మళ్లీ తమ ప్రభను కోల్పోతున్నాయని, కనీస సౌకర్యాల కల్పనకు నిధులు లేని దుస్థితి ఉన్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కుంగిన పిల్లర్లు మరమ్మతు చేయించలేని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని, తుమ్మడిహట్టిపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే సీఎంగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలన్నారు.
ప్రజల పక్షాన పోరాటం చేయడం తన నైజమని, అధికార పక్షంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై స్పందిస్తానన్నారు. రెండేళ్లలో జగిత్యాల ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ సూల్కు స్థలం సమావేశంలో ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ హరిచరణ్‌రావు, తాటిపర్తి రాంచంద్ర రెడ్డి, తాటిపర్తి సీకె రెడ్డి, సర్పంచ్ జున్ను రాజేందర్, పొట్టవతిని సతీశ్, శీలం సురేందర్, స్వామి రెడ్డి, పోనిశెట్టి మహేశ్, రవి, మల్లారెడ్డి,వంశీ, చెవుల గంగన్న, పాక్స్ మాజీ ఛైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధర రమేశ్ బాబు, శ్రీరాముల గంగాధర్ పాల్గొన్నారు.
ప్రతి ఓటరను కలిసే అవకాశం
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఆంక్షలు తెచ్చారు. ప్రజల్లో భయానక వాతావరణం కల్పించారు. ‘సర్’ పేరిట పశ్చిమబెంగాల్లో 30 లక్షల ఓట్లు తొలగించారు. తెలంగాణలోనూ అదే పనిచేయాలని చూస్తున్నారు. దీనిని అడ్డుకోవాలి. సర్ అమలులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎంత బాధ్యత ఉన్నదో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు అంతే బాధ్యత ఉన్నది. సర్‌తో ప్రతి ఓటరును కలిసే అవకాశం లభిస్తుంది. నాయకులు, కార్యకర్తలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి. ఓటర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. లీగల్ సలహాలు, సూచనల కోసం కమిటీ పనిచేస్తున్నది.
– జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలి
సర్‌లో అర్హుల ఓట్లు తొలగించకుండా బూత్ లెవెల్ ఏజెంట్స్ సరి చూడాలి. ఓటర్లను కలిసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యకర్తలకు ఎలాంటి న్యాయ సహాయమైన పార్టీ కార్యాలయంలో అందిస్తాం. బూత్ స్థాయి ఏజెంట్లు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు వెయ్యి ఏనుగుల బలం చేకూరింది. పార్టీ సభ్యత్వాలను జగిత్యాల నుంచి రికార్డు స్థాయిలో చేయాలి.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్