కరీంనగర్ విద్యానగర్, జూన్ 29 : వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ పద్మనగర్‌లోని ప్రకృతి బంకెట్ హాల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ సైంటిఫిక్ సెమినార్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సెమినార్లో కరీంనగర్‌కి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు కొడిత్యాల శ్రీనివాస్ లైవ్‌లో ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీపై, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాత లాజికల్ ప్రిస్రిప్షన్పై, డాక్టర్ గణేశ్ ఆచారి కార్డియోమైపోతిపై, డాక్టర్ హీరోలాల్ అగర్వాల్ రేనల్ వ్యాధులపై సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గంగుల తన స్వీయ అనుభవాన్ని వివరించారు.
గతంలో తాను సీయోలుకు వెళ్లినప్పుడు విపరీతమైన దగ్గు రాగా వారం పాటు ఇబ్బంది పడినట్టు గుర్తు చేశారు. ఎన్నో కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి ఎన్ని పరీక్షలు చేయించుకున్నా దగ్గు తగ్గలేదన్నారు. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ దవాఖాన వెళ్తే ఏకంగా శస్త్త్ర చికిత్స అవసరం అని చెప్పారని, అప్పుడు తనతో ఉన్న అప్పటి ఒక మంత్రి హైదరాబాద్‌లోని హోమియో వైద్యుడు జనార్దన్‌రెడ్డిని కలవాలని సూచించడంతో వెంటనే కాల్ చేశానని, ఆయన స్పందించి వీడియో కాల్‌లోనే లక్షణాలు తెలుసుకొని గుళికల లాంటి మందులను పంపించారని చెప్పారు. ఆ గుళికలు వేసుకున్న వారం రోజుల్లోనే పూర్తిగా దగ్గు తగ్గిపోయిందని గుర్తు చేశారు.
ఈ మధ్యలో వైద్యుడిని సంప్రదిస్తే ఏడాది పాటు కోర్సు వాడితే జీవితంలో ఎలర్జీ రాదని చెప్పారని, ప్రస్తుతం రెండు నెలలైందని, మరో 10 నెలలు మందులు వాడుతానని చెప్పారు. ఇటీవల అమెరికాకు వెళ్లినా అకడ తన ఫ్రెండ్ శ్రీధర్‌రెడ్డి డాక్టర్ అయినప్పటికీ వాళ్ల భార్యకి సిన్ డిసీజ్ రావడంతో ఇకడికి వచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిపారు. తిరిగి అమెరికాకు వెళ్లగానే మళ్లీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పడంతో డాక్టర్ జనార్దన్‌రెడ్డిని మళ్లీ కలిశానని చెప్పారు.
వెంటనే ఆ డాక్టర్ మళ్లీ వీడియో కాల్లో లక్షణాలు తెలుసుకొని గుళికలను పంపించారని, ప్రస్తుతం చాలా రిలీఫ్‌గా ఉందని చెప్పారని, ఈ రెండు ఘటనలే తనకు ఈ వైద్యంపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు. అల్లోపతి వైద్యంలో అయితే ఎంతోమంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఒకొక విభాగానికి ఉంటారని, అదే హోమియోపతిలో అన్ని వ్యాధులకు ఒకే వైద్యుడు ఉండడంతోపాటు ఈ మందులకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకపోవడం శుభ పరిణామమని తెలిపారు. హోమియో వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని దీనికి మీరంతా సహకరించాలని కోరారు.
సంఘ భవన నిర్మాణానికి స్థలం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 2025-27 సంవత్సరానికి రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా గుజరాత్‌కు చెందిన డాక్టర్ నిశికత్ తాపే వ్యవహరించారు. కరీంనగర్ యూనిట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్యుల జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శివమూర్తి, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ రావు, డాక్టర్ ఎంఎన్ రాజు, డాక్టర్లు దీపక్ బాబు, ఎన్ ఎస్ రెడ్డి, దయాకర్, దినాకర్, రవికుమార్, రవీంద్ర చారి, హప్సాన, కృష్ణకాంత్, కేశవరెడ్డి, డేవిడ్, అరుణ, జ్యోతితో పాటు 300 మంది వైద్యులు పాల్గొన్నారు.