ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్‌కు కొత్త వివాదాలను తెచ్చిపెడుతున్నది. ఈ కమిటీల్లో చోటు కోసం పార్టీలో వివిధ వర్గాలు ‘ఢీ అంటే ఢీ’ అనే పరిస్థితి కనిపిస్తున్నది. అందులో భాగంగానే మెజార్టీ వార్డులు, డివిజన్ల నుంచి రెండు, మూడు జాబితాలు అధికారులకు చేరగా.. ‘అవకాశం నాకంటే నాకే ఇవ్వాలి’ అని ఆయా వర్గాలు పట్టుపడుతున్న తీరు ప్రస్తుతం పార్టీకి తలనొప్పిలా మారుతున్నది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొత్త వారికి అవకాశం కల్పిస్తూ పాతవారికి పాతరేస్తున్నారన్న విమర్శలు వస్తుండగా.. అధికారిక జాబితా వెలువడితేనే అసలు వ్యవహారం బయట పడనున్నది. కమిటీల్లో స్థానం కోసం పోటాపోటీ ఉన్న నేపథ్యంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఆయా జాబితాలను కలెక్టర్‌కు పంపించగా, సదరు జాబితాలను కలెక్టర్ నేరుగా ఇన్చార్జి మంత్రికి పంపినట్టు తెలుస్తున్నది. మరోవైపు కొంతమంది నాయకులు నేరుగా ఇన్చార్జి మంత్రిని కలిసి జాబితాను సమర్పించినట్టు తెలుస్తుండగా, ఈపరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. స్థలం ఉన్న పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 5.49 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టకున్నట్టు స్పష్టం చేసింది. పట్టణాలు వంటివి కాకుండా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడుత కింద 3,500 ఇండ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 45,500 ఇండ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అర్హులను ఎంపిక చేసేందుకు వార్డులు, డివిజన్ల వారీగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నెల 11న రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ నెల 19 నాటికి కమిటీల ఎంపిక పూర్తి కావాలి. ఒక్కో కమిటీలో ఏడుగురికి అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఎవరిని కమిటీల్లోకి తీసుకోవాలో స్పష్టంగా చెప్పింది. గ్రామ పంచాయతీల్లో అయితే సర్పంచ్ లేదా ప్రత్యేకాధికారి చైర్మన్‌గా, కార్యదర్శి కన్వీనర్‌గా ఉండాలని సూచించింది. స్వయం సహాయక సంఘాల నుంచి మరో ఇద్దరు, ఇంకో ముగ్గురు స్థానిక సభ్యులు ఉండాలని పేరొంది. అయితే ఆ ముగ్గురిలో వెనుకడిన తరగతుల (బీసీ), దళిత (ఎస్సీ), గిరిజన (ఎస్టీ ) వర్గాల నుంచి ఒక్కొక్కరికీ అవకాశం కల్పిచాలని స్పష్టం చేసింది. అలాగే మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని వార్డు, డివిజన్ స్థాయి కమిటీల్లో కౌన్సిలర్, లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. స్వయం సహాయక సంఘాల గ్రూపు నుంచి ఇద్దరు, ముగ్గురు స్థానికులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇక్కడా కూడా పంచాయతీ కమిటీలకు వర్తించిన రిజర్వేషన్లే వర్తిస్తాయి.
ఉమ్మడి జిల్లాలో 1,214 పంచాయతీలుండగా 11,180 వార్డులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జగిత్యాలలో 383 జీపీలుండగా 3,500 వార్డులున్నాయి. పెద్దపల్లిలోని 263 పంచాయతీల్లో 2,472 వార్డులు, కరీంనగర్‌లోని 313 జీపీల్లో 2,966 వార్డులు, రాజన్న సిరిసిల్లలోని 255 జీపీల్లో 2,240 వార్డులున్నాయి. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 351 వార్డులు, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో 110 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో పంచాయతీ, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్లు కలిపి మొత్తం 11,646 ఇందిరమ్మ కమిటీలను నియమించాల్సి ఉన్నది. ఇప్పటికే ఆయా జాబితాలను సిద్ధం చేసిన పార్టీ నాయకత్వం, వాటిని ఆయా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు 70 వార్డులు, డివిజన్ల నుంచి రెండు లేదా అంతకుమించి జాబితాలు వచ్చినట్టు తెలుస్తున్నది.
ఇందిరమ్మ కమిటీల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కొన్నిచోట్ల అసంతృప్తులు బయటకు వస్తుండగా, మరికొన్ని చోట్ల ప్రచ్ఛన్న యుద్ధం నెలకొన్నది. ఇంకొన్నిచోట్ల అంతర్గతంగా రగులుతున్నా అధికారిక జాబితా వచ్చేవరకు వేచి చూసి, ఆ తర్వాత మాట్లాడుదామని చర్చించుకోవడం కనిపిస్తున్నది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పై చేయి ఉన్నట్టు శ్రేణుల ముందు నిలువడానికి ఎవరి దారుల్లో వారు ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంతో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో తమ వారినే నియమించుకోవాలన్న ఉద్దేశంతో ఇద్దరు వేర్వేరు జాబితాలు తయారు చేసి.. ఇటు అధికారులు, అటు ఇన్చార్జి మంత్రికి సమర్పించినట్టు తెలుస్తున్నది. అందులో ఎవరి జాబితాకు ఆమోదం తెలుపుతారన్న చర్చ ప్రస్తుతం జగిత్యాలలో హాట్‌టాపిక్‌లా మారింది. అంతేకాదు, సీనియర్ నాయకుడిగా తాను ప్రతిపాదించిన కమిటీలకు విలువ ఇవ్వకుంటే.. పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు జీవన్‌రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇదే తరుణంలో ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, పై చేయి తనదే అని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో.. అన్న చర్చ జరుగుతున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అదే తీరు నెలకొన్నది. ఇక్కడ కొంత మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు.. వారికి వారే జాబితా తయారు చేసుకొని అధికారులకు సమర్పించారు. అలాగే కాంగ్రెస్ నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డితో ఆయన వర్గీయులు నగరంలోని 60 డివిజన్లలో ఒక జాబితా తయారు చేసి.. అధికారులతోపాటు ఇన్చార్జి మంత్రికి సమర్పించినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ కూడా మరో లిస్ట్ తయారు చేసి, తన జాబితాకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గీయులు కూడా జాబితా సిద్ధం చేసి అధికారులకు సమర్పించడంతోపాటు పొన్నంకు, ఇన్చార్జి మంత్రికి ఇచ్చినట్టు తెలిసింది. అలాగే వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త వాళ్లకు కమిటీల్లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించిన కొంత మంది పాతనాయకులు.. కమిటీల్లో స్థానం దక్కించుకోవడానికి ఇన్చార్జి మంత్రిని కలిసి కొన్ని పేర్లను ఇచ్చినట్టు సమాచారం అందుతున్నది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజవకర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాత వాళ్లకు కాకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆది నుంచీ పార్టీని పట్టుకొని ఉన్న వారికి అవకాశం కల్పించాలని కోరుతూ కొంత మంది ఇన్చార్జి మంత్రిని కలిసినట్టు పార్టీవర్గాల ద్వారా సమాచారం అందుతున్నది.
ప్రస్తుతం జాబితాలన్నీ ఇన్చార్జి మంత్రికి చేరాయి. సదరు మంత్రి ఆమోద ముద్రవేసిన తర్వాత ఆయా వార్డుల కమిటీలను అధికారికంగా ప్రకటించనున్నారు. అధికారిక జాబితా వస్తే కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమంటాయన్న చర్చ ప్రస్తుతం ఆపార్టీలో నడుస్తున్నది. ప్రస్తుతం ఎవరూ వెళ్లినా.. మీకే కమిటీలో అవకాశం ఉంటుందని పై స్థాయి నాయకులు సర్దిచెబుతున్నారు. దీంతో సదరు నాయకులంతా అంతర్గతంగా కోపంతో ఉన్నా సమయం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారిక జాబితా వెలువడితే అసలు వ్యవహారం బహిర్గతం అవుతుందని, అప్పుడు కమిటీ లొల్లి బజారున పడడం తప్పదన్న సంకేతాలను కొంత మంది క్షేత్రస్థాయి కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నారు.