కరీంనగర్ రూరల్, మార్చి 17 : ఎస్సారెస్పీ కాలువ నీటి కోసం పలువురు రైతులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం కరీంనగర్ మండలంలోని చామనపల్లి, తాహెర్ కొండాపూర్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్రామాల రైతులు కాలువ నీటి కోసం వెదురుగట్ట శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ డీ 86 వద్దకు వెళ్లారు. తమ గ్రామాలకు వచ్చే 11 ఆర్ ఉప కాలువ తూము షటర్ పైకి లేపేందుకు రైతులు ప్రయత్నించగా జూలపల్లి పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. కాలువ నీళ్లు రాకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ పలువురు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు రైతులు బలవంతంగా కొంత మేర షటర్ ఎత్తడంతో ఉపకాలువలోకి నీళ్లు రాగా, వివాదం సద్దుమణిగింది.